close

తాజా వార్తలు

Updated : 14/04/2021 20:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆగం కావొద్దు ఆలోచించి ఓటేయండి: కేసీఆర్‌

అనుముల: నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి చేసింది శూన్యమని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. 30 ఏళ్ల అనుభవమున్న జానారెడ్డి.. నియోజకవర్గంలోని హాలియాకు డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియా పరిధిలోని అనుములలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని.. పరిణతితో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. 

మిత్రుడు నోముల నర్సింహయ్యను కోల్పోవడం బాధాకరమని సీఎం అన్నారు. వామపక్ష పార్టీల్లో ఉంటూ ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన తనయుడు, తెరాస అభ్యర్థి నోముల భగత్‌ను ఆశీర్వదించాలని కోరారు. నియోజకవర్గంలో భగత్‌ గాలి బాగానే ఉందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. భగత్‌కు కురిపించే ఓట్లలాగే నెల్లికల్‌ లిఫ్ట్‌కు నీళ్లు కూడా దూకుతాయని చెప్పారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు నిర్ణయించుకోవాలని.. ఎవరెన్ని చెప్పినా విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండాలంటే పాలు రావని.. ముళ్ల చెట్టు పెట్టి నీరు పోస్తే పండ్లు కాయవంటూ తనదైన శైలిలో చెప్పారు. నందికొండ గురుకుల పాఠశాలను డిగ్రీ కళాశాలగా మారుస్తామన్నారు. హాలియాకు డిగ్రీ కళాశాల మంజూరుచేశామని.. త్వరలో సాగర్‌లోనూ రాబోతోందని సీఎం చెప్పారు.  

నాకు సీఎం పదవి తెలంగాణ ప్రజల భిక్ష..

‘‘కేసీఆర్‌కు సీఎం పదవి.. జానారెడ్డి పెట్టిన భిక్ష అని ఒకాయన అన్నారు. నాకు సీఎం పదవి భిక్ష పెట్టింది తెలంగాణ ప్రజలు. పదవుల కోసం పెదవులు మూసుకున్నోళ్లు కాంగ్రెస్‌ నేతలు. ఉద్యమం మొదలు పెట్టిన నాడే డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి గులాబీ జెండా ఎగురవేశా. వెనక్కి తిరగనని.. అలా చేస్తే రాళ్లతో కొట్టమని చెప్పా. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా వదిలేశాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్‌ నేతలు ఏరోజూ నోరు విప్పలేదు. కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం తెలంగాణను ఆంధ్రావాళ్లకు వదిలిపెడితే.. తెలంగాణ కోసం పదవులను వదిలిపెట్టింది తెరాస. నాడు నాకు ధనబలం, మీడియా బలం లేదు.. ఆత్మబలంతో అడుగు ముందుకేశా. దీక్ష కొనసాగిస్తే.. కోమాలోకి వెళ్తానని వైద్యులు హెచ్చరించినా వినకుండా కేసీఆర్‌ సచ్చుడో ..తెలంగాణ వచ్చుడో అని దీక్ష కొనసాగించా.. అదే దీక్ష నేడు తెలంగాణ తెచ్చింది. 


ఒట్టిమాటలకు మోసపోవద్దు..

రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి.. ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాం. అభివృద్ధి మీ కళ్లముందే ఉంది. కాంగ్రెస్‌ నేతలు 60 ఏళ్లు పాలించి ఆగమాగం చేశారు. నాడు విద్యుత్‌ పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజల పాదాలు కడుగుతున్నాం. నెల్లికల్‌ లిఫ్ట్‌లో మీరు కూడా కేరింతలు కొట్టాలి. బల్ల గుద్ది.. రొమ్ము విరిచి.. కాలర్‌ ఎగరేసి చెబుతున్నా.. దేశంలో ఈ యాసంగిలో 52.79లక్షల ఎకరాల్లో నా తెలంగాణ వరి సాగుచేసింది. అభివృద్ధిని చూసీ చూడనట్టు ఉండొద్దు. ఒట్టి మాటలకు మోసపోవద్దు. భగత్‌ను ఆదరించి తెరాసను గెలిపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఓటు వేసేముందు దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి’’ అని కేసీఆర్‌ కోరారు.  

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని