నాగార్జునసాగర్‌లో కారు జోరు
close

తాజా వార్తలు

Updated : 02/05/2021 17:32 IST

నాగార్జునసాగర్‌లో కారు జోరు

 తెరాస అభ్యర్థి నోముల భగత్‌ గెలుపు
 కాంగ్రెస్‌కు తప్పని ఓటమి.. భాజపాకు డిపాజిట్‌ గల్లంతు

నల్గొండ: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ తెరాస ఘన విజయం సాధించింది. తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేసింది. గెలుపే లక్ష్యంగా ఉప ఎన్నిక బరిలోకి దిగిన తెరాస సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ 18,478 ఓట్ల మెజారిటీతో గెలుపును కైవసం చేసుకున్నారు. కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి తెరాసకు తెరాసకు 89,804  ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 70,932 ఓట్లు, భాజపాకు 7,676 ఓట్లు, తెదేపా 1,714 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులకు 2,915 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో జానారెడ్డి రెండో స్థానంలో ఉండగా.. భాజపా డిపాజిట్‌ కోల్పోయింది. ఉప ఎన్నిక వేళ అధికార పార్టీ.. దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య కుమారుడు భగత్‌ను బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ నాయకుడు జానారెడ్డి పోటీ పడ్డారు. భాజపా నుంచి రవికుమార్‌ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దివంగత తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతిలో సాగర్‌లో ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. 

సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకున్న తెరాస..

తాజా గెలుపుతో.. సాగర్‌లో అధికార పార్టీ తన సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నోముల నర్సింహయ్య 83,655 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనారోగ్య కారణాలతో ఆయన గతేడాది డిసెంబర్‌లో కన్నుమూశారు. దీంతో సాగర్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాకలో ప్రతికూల ఫలితం, జీహెచ్ఎంసీలో ఆశించిన మేర సీట్లు సాధించకపోవడంతో తెరాస ఈ ఉప ఎన్నికపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని రాజకీయ విశ్లేషకుల మాట. ఈ రెండు ఎన్నికల తర్వాత జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ పుంజుకుంది. ఆ ఫలితాలు తెరాసలో ఉత్సాహాన్ని నింపాయి. ఆ కొనసాగింపు సాగర్‌లోనూ కనిపించింది. 

కలిసొచ్చిన ఎమ్మెల్సీ ఫలితాలు.. సీఎం బహిరంగ సభలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆశించిన మేర రాణించలేకపోయిన తెరాస ఆ తర్వాత జరిగిన మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఒక స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మహాబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో పార్టీలో కొత్త జోష్‌ కనిపించింది. దుబ్బాకలో స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయినా.. జీహెచ్‌ఎంసీ ఫలితాలు ఆలోచనలో పడేసేలా చేసినా.. ఈ తాజా ఫలితంలో తెరాస తన స్పష్టమైన బలాన్ని ప్రదర్శించిందని విశ్లేషకుల మాట. దీంతో పాటు సీఎం కేసీఆర్‌ సాగర్‌ నియోజకవర్గంలో రెండు సార్లు బహిరంగ సభలు ఏర్పాటు చేయడం కూడా తెరాసకు లాభం చేకూర్చింది. 

కొత్తరెక్కలొస్తాయని భావించినా.. పరాభవం

 
 

సాగర్‌లో తెరాసకు గట్టి పోటి ఇచ్చిన కాంగ్రెస్‌ మరో పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఉప ఎన్నిక వేళ వ్యుహాత్మకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌.. ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డిని బరిలో నిలిపింది. గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పని చేసిన అనుభవం ఉన్న జానారెడ్డి గెలిస్తే పార్టీకి కొత్త రెక్కలొస్తాయని కాంగ్రెస్‌ భావించినా.. ఆ మేరకు అనుకూల ఫలితం రాలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింహయ్యపై పోటీ చేసిన జానారెడ్డి 75,884 ఓట్లు సాధించి ఓడిపోయారు. సాగర్ ఉప ఎన్నికలు రెండో స్థానానికి పరిమితమయ్యారు.

ప్రభావం చూపలేకపోయిన భాజపా..


 

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్యంగా రాణించిన భారతీయ జనతా పార్టీ.. సాగర్‌ ఉప ఎన్నికలో దూకుడు ప్రదర్శించలేకపోయింది. అనేక సమీకరణల తర్వాత బరిలోకి తీసుకొచ్చిన తమ అభ్యర్థి రవికుమార్‌ పోటీ ఇవ్వలేకపోయారు. తాజాగా సాగర్‌ ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయింది. జీహెచ్‌ఎంసీలో తెరాసకు గట్టి పోటీ ఇచ్చి తన ఉనికిని బలంగా చాటిన భాజపా సాగర్‌లో చతికిలపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల్లోనూ భాజపాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని