భారత్‌లో వైరస్‌ ఉద్ధృతి ప్రపంచానికే ప్రమాదం: రాహుల్‌

తాజా వార్తలు

Updated : 07/05/2021 15:35 IST

భారత్‌లో వైరస్‌ ఉద్ధృతి ప్రపంచానికే ప్రమాదం: రాహుల్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కేవలం భారత్‌కే కాకుండా ప్రపంచం మొత్తానికీ ప్రమాదం అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కొవిడ్‌-19 వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం లేకపోవడం వల్లే మహమ్మారి సునామీలా విరుచుకుపడుతోందని ఆరోపించారు. ఈ మేరకు కొవిడ్‌ కట్టడికి పలు సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

కరోనా వ్యాప్తి భయానకంగా ఉన్న నేపథ్యంలో ప్రజల్ని కాపాడేందుకు చేయాల్సిన ప్రతి చర్య అమలు చేయాలని రాహుల్‌ ప్రధానిని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో ప్రతి ఆరుగురు బాధితుల్లో ఒకరు భారతీయులని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన దేశంలో ఉన్న జన్యుపరమైన వైవిధ్యం, అధిక జనాభా వంటి అంశాలు భారత్‌లో వైరస్‌ వేగంగా వ్యాపిస్తూ రూపాంతరం చెందడానికి దోహదం చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. దీంతో వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారడంతో పాటు వేగంగా వ్యాపించే గుణాన్ని సంతరించుకుందన్నారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన డబుల్‌, ట్రిపుల్‌ మ్యూటెంట్లు కేవలం ఆరంభం మాత్రమేననన్నారు. ఈ పరిస్థితులు తనని భయాందోళనలకు గురిచేస్తున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో కొన్ని కీలక అంశాల్ని వెంటనే అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాహుల్‌ సూచించారు. అవేంటంటే...

* జన్యుక్రమ విశ్లేషణ ద్వారా దేశవ్యాప్తంగా వైరస్‌, దాని మ్యూటెంట్లను శాస్త్రీయంగా నిర్ధారించాలి.

* కొత్త రకాల వైరస్‌లపై వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని విశ్లేషించాలి.

* దేశంలో ప్రతిఒక్కరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ అందించాలి.

* మన పరిశోధనల్లో తేలే అంశాలపై పారదర్శకత పాటిస్తూ యావత్తు ప్రపంచానికి అన్ని విషయాలను తెలియజేయాలని రాహుల్‌ ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల దేశంలో లాక్‌డౌన్‌ విధించాల్సిన అవసరం ఏర్పడిందని రాహుల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల్ని లాక్‌డౌన్‌కు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ వల్ల కొన్ని వర్గాలు ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి ప్రజల్ని రక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆహారంతో పాటు ఆర్థికంగా సాయం చేయాలని హితవు పలికారు. అలాగే ప్రయాణాలు అనివార్యమైన వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. లాక్‌డౌన్‌ వల్ల తలెత్తే ఆర్థికపరమైన ఇబ్బందులపైనే ప్రభుత్వం ఆందోళన చెందుతోందని తెలిపారు. కానీ, వైరస్‌ వ్యాప్తి వల్ల తలెత్తే ప్రాణ నష్టం, మానవ సంక్షోభాన్ని అంచనా కూడా వేయలేమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించుకునేందుకు అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని కోరారు. అందుకు కాంగ్రెస్‌ తరఫున సంపూర్ణ సహకారం లభిస్తుందని హామీ ఇచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని