‘370’ పునరుద్ధరణపై దీర్ఘకాలిక పోరు చేస్తాం

తాజా వార్తలు

Published : 03/01/2021 23:28 IST

‘370’ పునరుద్ధరణపై దీర్ఘకాలిక పోరు చేస్తాం

 పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ 

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించిన 370 అధికరణం పునరుద్ధరణపై దీర్ఘకాలిక, కఠినమైన రాజకీయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ చెప్పారు. ఆదివారం ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ అధికరణం రద్దు రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. 370 అర్టికల్‌ రద్దును ఈ ప్రాంతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ అధికరణం రద్దుతో పాటు, రాష్ట్ర హోదాను ఎత్తివేయడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. రాజ్యాంగం పరిధిలోనే సమస్యలను పరిష్కరించాలంటూ ఇంతవరకు వాదిస్తూ వచ్చిన జమ్మూ-కశ్మీర్‌ పార్టీలకు ఈ నిర్ణయం ఇరకాటంలో పెట్టిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, దేశ సార్వభౌమాధికారంపై రాజీ పడకుండా దీనిపై ఉద్యమిస్తామని చెప్పారు. అన్ని విషయాల్లో పార్లమెంటుకే సర్వాధికారం ఉందని అంటే రైతులు రోడ్లపైకి వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. 370 ఆర్టికల్‌ రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్‌ పార్టీలను బలిపశువులను చేసిందని ఆరోపించారు. ‘‘మేం పాకిస్థాన్‌కు అనుకూలమంటూ దిల్లీ నుంచి ఆరోపణలు వస్తుంటాయి. కశ్మీర్‌కు వ్యతిరేకంగా ఉంటున్నామంటూ స్థానికులు అంటున్నారు. మా రాజకీయ జీవితం మొత్తం ఈ ఆరోపణలతోనే నలిగిపోతోంది’’ అని వ్యాఖ్యానించారు. తన హయాంలో జరిగిన అవినీతిపై కేంద్రం దర్యాప్తు జరపనుండడంపై స్పందిస్తూ ‘‘ఒక్క కేసునైనా నిరూపించండి. పర్యవసానాలకు సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు. తన తండ్రి సమాధి నిర్మాణంపై కూడా ఆడిట్‌ జరపనున్నారని, మరీ ఇంత దిగజారుడా అని ప్రశ్నించారు. 

ఇవీ చదవండి..

భారత్‌ ఏది సాధించినా వీళ్లు గర్వించలేరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని