అవును.. మేం గూండాలమే: సంజయ్‌ రౌత్‌
close

తాజా వార్తలు

Published : 18/06/2021 01:29 IST

అవును.. మేం గూండాలమే: సంజయ్‌ రౌత్‌

ముంబయి: శివసేన కార్యాలయం ఎదుట ఘర్షణ అనంతరం భాజపా చేసిన వ్యాఖ్యలను శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ తిప్పికొట్టారు. తమని గూండాలని ఎవరూ ధ్రువీకరించాల్సిన అవసరం లేదని, తామంతా గూండాలమేనని వ్యాఖ్యానించారు. మరాఠీ ప్రజల ఆత్మాభిమానం, హిందుత్వం విషయానికి కొచ్చేసరికి తామంతా సర్టిఫైడ్‌ గూండాలమే అని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయం రాష్ట్ర గౌరవానికి, రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీక అని, దానిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అయోధ్య భూముల విషయంలో శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భాజపా అరోపించింది. దీనిపై ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం ముంబయిలో ఆందోళన నిర్వహించింది. శివసేనకు, సామ్నాకు వ్యతిరేకంగా ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసేందుకు వస్తున్నారన్న సమాచారంతో శివసేన కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. 

‘‘భాజపా కార్యకర్తలంతా పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడానికి వస్తున్నారనుకున్నాం. కానీ, వాళ్లంతా పార్టీ ఆఫీసుపై దాడి చేయడానికి వస్తున్నారని అర్థమైంది. అందుకే పార్టీ ఆఫీసు దగ్గరికి రాకముందే వారిని నిలువరించాం’’ అని శివసేన ఎమ్మెల్యే సదా సర్వాంకర్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘బాలా సాహెబ్‌ ఠాక్రే శివసేన భవన్‌ ఎదుటే కూర్చున్నారు. ఒకవేళ ఎవరైనా శివసేన భవన్‌పై దాడి చేస్తే, వారికి బదులిచ్చేవాళ్లం. దీనిని గూండాగిరీ అనుకుంటే, మేమంతా గూండాలమే’’ అని రౌత్‌  వ్యాఖ్యానించారు.

‘‘భాజపా ఎందుకు అంత ఆందోళన చెందుతోంది? సామ్నా సంపాదకీయం ఏం చెబుతోంది? ఆయోధ్య భూముల వ్యవహారంలో తప్పుడు మార్గంలో ఎవరికైనా డబ్బులు ముట్టచెప్పారో లేదో వివరణ కోరింది. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వారిని శిక్షించాలని కోరింది. ఈ దేశంలో వివరణ కోరడం కూడా నేరమా? ఈ విషయంలో భాజపా జోక్యం ఉందని సంపాదకీయంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు అక్కడున్న ఆరోపణలు ఏంటి?శివసేన ప్రతినిధులు ఏం చెప్పారో ముందు అర్థం చేసుకోండి?అసలు మీకు చదువు వచ్చా? రాదా’’ అంటూ సంజ్‌రౌత్‌ విమర్శించారు. రాముడి ప్రతిష్ఠకు శివసేన భంగం కలిగిస్తోందని భాజపా ఆరోపించింది. ‘‘బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు శివసేనను చూస్తే గర్వంగా ఉండేది. కానీ ప్రస్తుతం వాళ్లకు సోనియాగాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా దేవతలైపోయారు’’ అని భాజపా నేత అశిష్‌ షెలార్‌ విమర్శించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని