నంది(సం)గ్రామ్‌ రేపే 

తాజా వార్తలు

Updated : 31/03/2021 16:58 IST

నంది(సం)గ్రామ్‌ రేపే 

దీదీ Vs సువేందు: పైచేయి ఎవరిదో! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ దశలో నందిగ్రామ్‌ సహా మొత్తం 30 నియోజకవర్గాల్లో గురువారం ఉదయం పోలింగ్‌ ప్రారంభం కానుంది. కొవిడ్‌ నిబంధనలకనుగుణంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య నువ్వానేనా అన్నట్టుగా జరుగుతున్న ఈ రసవత్తర పోరులో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టాలని దీదీ.. ఎలాగైనా పాగా వేయాల్సిందేనన్న పట్టుదలతో భాజపా ప్రచారం  హోరెత్తించాయి. రెండో విడతలో ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలన్నీ దక్షిణ 24పరగణాస్‌, బంకురా, మేదినాపూర్‌ జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అందరిచూపూ నందిగ్రామ్‌పైనే నెలకొంది. 

తృణమూల్‌ తరఫున సీఎం మమతా బెనర్జీ, గతంలో ఆమెకు కుడిభుజంగా ఉండి భాజపాలో చేరిన సువేందు అధికారి తలపడటంతో నందిగ్రామ్‌ ఎన్నిక రసవత్తరంగా మారింది. మమత తన సిట్టింగ్‌ స్థానాన్ని వదులుకొని ఈసారి నందిగ్రామ్‌ నుంచి పోటీచేయడం.. అలాగే, ఆ ప్రాంత రాజకీయాలను శాసించే కుటుంబానికి చెందిన మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి భాజపా తరఫున బరిలో నిలవడంతో ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో దీదీని ఓడించాలన్న పట్టుదలతో భాజపా తీవ్రంగా శ్రమించగా.. ఎలాగైనా గెలిచి సువేందుకు కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలని దీదీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రెండు పార్టీలూ తీవ్రస్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను హీటెక్కించాయి. గెలుపే లక్ష్యంగా సర్వశక్తుల్నీ ధారపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికల్లో నందిగ్రామ్‌ ప్రజలు ఈసారి దీదీని ఆశీర్వదిస్తారా? లేదంటే మళ్లీ సువేందుకే ఛాన్స్‌ ఇస్తారో చూడాలి.

రెండో విడత ఎన్నికలు జరగనున్న 30 నియోజకవర్గాల్లో మొత్తం 171మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 152మంది పురుషులు కాగా 19మంది మహిళా అభ్యర్థులు. నందిగ్రామ్‌ నుంచి సీఎం మమతా బెనర్జీ, భాజపా నుంచి సువేందు అధికారి బరిలో నిలవగా.. లెఫ్ట్‌ఫ్రంట్‌ అభ్యర్థిగా మీనాక్షి ముఖర్జీ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నందిగ్రామ్‌లో ఇప్పటివరకు వామపక్షాలు ఎనిమిది సార్లు గెలవగా.. తృణమూల్‌ మూడు పర్యాయాలు విజయం సాధించింది. పశ్చిమబెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడతల్లో ఎన్నికల సంఘం పోలింగ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 27న తొలి విడతలో 30 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా.. గురువారం మరో 30 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

మరోవైపు, అసోంలోనూ రేపు రెండో విడత ఎన్నికలు 39 నియోజకవర్గాల్లో జరగనున్నాయి. మొత్తం 126 స్థానాలు కలిగిన అసోంలో ఎన్నికల సంఘం ఈసారి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 27న తొలి విడతలో 47 స్థానాలకు ఎన్నిక  ఎన్నికలు జరగ్గా.. రేపు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 6న మరో 40 స్థానాల్లో మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని