అస్సాం సీఎంగా హిమంతనే ఎందుకు?
close

తాజా వార్తలు

Published : 10/05/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అస్సాం సీఎంగా హిమంతనే ఎందుకు?

సోనోవాల్‌కు భాజపా అధిష్ఠానం హామీ ఎంటి?

 

గువాహటి: అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ఆదివారం భాజపా శాసనసభాపక్ష నేతగా బిశ్వశర్మను ఏకగ్రీవంగా ఎన్నుకొని వారం రోజుల ఉత్కంఠకు భాజపా అధిష్ఠానం తెరదించింది. వాస్తవానికి బిశ్వశర్మతో పాటు మాజీ ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ సైతం సీఎం రేసులో ఉన్నారు. కానీ, చివరకు భాజపా పెద్దలు బిశ్వశర్మ వైపే మొగ్గుచూపడానికి గల కారణాలేంటో చూద్దాం!

సంక్షోభాల పరిష్కర్త...

అత్యంత చురుకైన రాజకీయ నాయకుడిగా, ఈశాన్య భారతంలో సంక్షోభాల పరిష్కర్తగా శర్మ అంచెలంచెలుగా ఎదిగారు. మొన్నటి ఎన్నికల్లో భాజపా తిరిగి అధికారంలోకి రావడానికి ఆయన ప్రచారం, ఎత్తుగడలు, వ్యూహాలు కారణమని భావిస్తున్నారు. మరోవైపు పశ్చిమ బంగాల్‌లో భాజపా ఘోర పరాభవం చవిచూసింది. ఈ నేపథ్యంలో బిశ్వశర్మకు ఇక్కడ కొంత స్వేచ్ఛనివ్వడం వల్ల తనదైన వ్యూహాలతో ఈశాన్య ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని అధిష్ఠానం భావించి ఉండొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. కొన్ని రాష్ట్రాల్లో పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ ప్రాంతాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటే కలిసొస్తుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ లక్ష్యం దిశగా పార్టీ రథాన్ని సమర్థంగా నడిపే సారథి బిశ్వశర్మే అని కమల పెద్దలు బలంగా నమ్మినట్లు తెలుస్తోంది. 

సమర్థంగా కొవిడ్‌ కట్టడి.. WHO ప్రశంసలు.. 

ఇక సోనోవాల్‌ మంత్రివర్గంలో అత్యంత సమర్థుడిగా బిశ్వశర్మకు పేరుంది. ఎన్నికలకు ముందు ఏడాదిపాటు ఆరోగ్యశాఖ మంత్రిగా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని పాలనాదక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొవిడ్‌ కట్టడిలో అస్సాంలో అవలంబిస్తున్న విధానాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కొనియాడింది. 

కీలక పథకాల రూపకర్త...

ఆర్థిక మంత్రిగా బిశ్వశర్మ అనేక ప్రజాకర్షక పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. పేద కుటుంబాల కోసం ‘ఒరుణోదయ్‌’, మహిళా సంక్షేమం కోసం ‘అరుందుతి’, విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్రవాహనాల పంపిణీ, పేద విద్యార్థులకు ఉచిత అడ్మిషన్‌, టీ గార్డెన్లలో పనిచేసే వర్గాల్లోని మహిళా గర్భిణులకు ఆర్థిక సాయం వంటి పథకాలు భాజపా గెలుపులో కీలక పాత్ర పోషించాయి. ఇవన్నీ బిశ్వశర్మ నేతృత్వంలోనే రూపకల్పన చేసుకోవడం గమనార్హం. 

అంతర్గత విభేధాలకు తావీయకుండా..

ఒకవేళ భాజపా అధిష్ఠానం శర్బానంద సోనోవాల్‌నే సీఎంగా కొనసాగించి ఉంటే పార్టీలో తీవ్ర అంతర్గత విభేదాలు తలెత్తేవన్న సంకేతాలు ఉన్నాయి. మెజారిటీ శాసనసభ సభ్యులు బిశ్వశర్మవైపే ఉన్నారన్న వాస్తవాన్ని అధిష్ఠానం పసిగట్టింది. వారి అభీష్టానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంది. లేదంటే బెంగాల్‌ పరాభవానికి అస్సాం విభేదాలు తోడై ఉంటే ఈశాన్యంలో ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్న పార్టీకి గడ్డు కాలం తప్పదన్న చేదు నిజాన్ని పార్టీ అధిష్ఠానం ముందే అంచనా వేయగలిగింది. పార్టీ బలోపేతంలో కీలకంగా వ్యవహరిస్తున్న బిశ్వశర్మ చిరకాల వాంఛను భాజపా ఎట్టకేలకు నెరవేర్చింది. 2014లో కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎం పదవి నిరాకరించినందు వల్లే బిశ్వశర్మీ పార్టీ ఫిరాయించి భాజపాలో చేరారన్న విషయం అందరికీ గుర్తున్న విషయమే. అన్నింటికీ మించి బోడోలాండ్‌ ప్రాంతంలో భాజపా కాలు పెట్టేలా చేయడం కేంద్ర నాయకత్వాన్ని ఆకట్టుకుంది. ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఆయనపై మంచి గురి ఉంది. అస్సాం ఒక్కటే కాదు.. ఈశాన్య ప్రాంతంలో తొలిసారి భాజపా గణనీయంగా పుంజుకోవడానికి శర్మ ప్రధాన కారణంగా భాజపా భావిస్తోంది.

రెండు దశాబ్దాల రాజకీయ దక్షత

హిమంత బిశ్వశర్మ(52) విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన శర్మ 2001లో జలుక్‌బరి నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వరుసగా అయిదోసారి అదే నియోజకవర్గం నుంచి లక్షకు పైగా ఆధిక్యంతో ఎన్నికయ్యారు. దివంగత కాంగ్రెస్‌ దిగ్గజం తరుణ్‌ గొగొయ్‌కు సన్నిహితునిగా వ్యవహరించి, ఆయనతో విభేదిస్తూ భాజపాలో చేరారు.

సోనోవాల్‌కు కేంద్రమంత్రి పదవి..?

దిల్లీలో అధిష్ఠానంతో చర్చలు ముగిసిన తర్వాత శాసనసభాపక్ష సమావేశానికి ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రొఫెసర్‌ జగదీష్‌ ముఖిని శర్బానంద సోనోవాల్‌ కలిసి ముఖ్యమంత్రిగా తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. శాసనసభాపక్ష సమావేశంలో హిమంత పేరును సోనోవాల్‌ స్వయంగా ప్రతిపాదించారు. ఎలాంటి విముఖత లేకుండా సోనోవాల్ ఈ క్రతువుకు ఉపక్రమించారంటే పార్టీ నుంచి ఆయనకు మంచి ఆఫరే వచ్చి ఉంటుందని అందరూ భావిసున్నారు. కేంద్రమంత్రి పదవి ఖాయమని దిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అస్సాంలో ఒక రాజ్యసభ్య స్థానం ఖాళీగా ఉంది. ఆ మార్గంలో ఆయన్ను దిల్లీకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, స్థానిక మీడియా మాత్రం ఆయన అస్సాంలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారని పేర్కొంటుండడం గమానర్హం. మోదీ తొలిసారి అధికారం చేపట్టిన సమయంలో సోనోవాల్‌ కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అవినీతిని ఏమాత్రం సహించని నేతగా సోనోవాల్‌ ముద్ర వేయించుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని