Yediyurappa: మౌనం వీడిన యడ్డీ.. నాయకత్వ మార్పుపై వ్యాఖ్యలు
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 15:47 IST

Yediyurappa: మౌనం వీడిన యడ్డీ.. నాయకత్వ మార్పుపై వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంలో గత కొంత కాలంగా వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం స్పందించారు. భాజపా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. ఈ నెల 26తో యడియూరప్ప సర్కారుకు రెండేళ్లు పూర్తికానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీఎంగా తన భవితవ్యంపై పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని యడ్డీ స్పష్టంచేశారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు తనపై ప్రత్యేకమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయన్నారు. పార్టీలో 75 ఏళ్లు పైబడిన వారికి స్థానం కల్పించని విషయం అందరికీ తెలుసు.. కానీ నా పనితీరును ప్రశంసిస్తూ 78 ఏళ్ల వయసు పైబడినా అవకాశం కల్పించారంటూ గుర్తుచేసుకున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాననన్నారు.

ఈ నెల 25న హైకమాండ్‌ పెద్దలు ఇచ్చిన ఆదేశాలు ఎలా ఉన్నా ఆ మరుసటి రోజు నుంచే పార్టీ బలోపేతం కోసం తన కార్యాచరణ మొదలవుతుందని చెప్పారు. కర్ణాటకలో భాజపా ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి ఆదేశాలకు అనుగుణంగా కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. గత వారంలో యడియూరప్ప దిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉంటుందని, సీఎంగా యడియూరప్ప రాజీనామా చేస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.

రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు అవకాశం ఉందనే సంకేతాలిచ్చేలా సీఎం యడియూరప్ప చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అరుణ్‌ సింగ్‌ను మీడియా ప్రతినిధులు దిల్లీలో ప్రశ్నించగా.. ‘అందరికీ నమస్కారం. ఒకరోజు అంతా కలిసి కూర్చుంటాం. చర్చించుకుంటాం’ అని సమాధానం ఇచ్చారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని