అందుకే జగన్‌ దిల్లీ పర్యటన: యనమల

తాజా వార్తలు

Published : 24/09/2020 13:03 IST

అందుకే జగన్‌ దిల్లీ పర్యటన: యనమల

అమరావతి: సంజాయిషీలు చెప్పడానికే సీఎం జగన్‌ దిల్లీ పర్యటనలు తప్ప.. రాష్ట్రానికి రావాల్సినవి సాధించడానికి కాదని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అరాచకాలు, అవినీతి చేయడం దిల్లీ వెళ్లి చీవాట్లు తినడమే జగన్‌ పని అని విమర్శించారు. తన కేసుల భవిష్యత్తే తప్ప రాష్ట్ర భవిష్యత్తు జగన్‌కు పట్టదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా పేరెత్తడం జగన్‌ మరచిపోయి 16 నెలలైందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన వైకాపా నోరు ఇప్పుడెందుకు మూతపడిందని నిలదీశారు.
కోర్టులో ఉన్న అమరావతి అంశంపై పదే పదే కేంద్రాన్ని ఒత్తిడి చేయడం గర్హనీయమని విమర్శించారు. ఇప్పటి వరకు జగన్‌ ఎన్నిసార్లు దిల్లీ వెళ్లారు? 16 నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎంపై ఉందని డిమాండ్‌ చేశారు. 16 నెలల్లో రూ.1.28లక్షల కోట్లు అప్పులు తేవడమే జగన్‌ మోహన్‌రెడ్డి  రికార్డని ఎద్దేవా చేశారు. 31వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులతో చంద్రబాబు గిన్నిస్‌ రికార్డు సాధిస్తే... నెలకు రూ.8వేల కోట్ల అప్పులు తేవడంలో జగన్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పారని దుయ్యబట్టారు. దేశంలోనే టాప్‌ 3 లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పుడు 21వ స్థానానికి పతనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు కొల్లగొట్టడంపై తప్ప సమాజంలో ఆస్తులు కల్పనపై వైకాపాకు దృష్టిలేదని విమర్శించారు. ఈ అరాచకాలకు వైకాపా తగిన మూల్యం చెల్లిస్తుందన్న యనమల... సరైన సమయంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని