రాజధాని కేంద్రం పరిధిలోని అంశం: యనమల

తాజా వార్తలు

Published : 18/07/2020 12:39 IST

రాజధాని కేంద్రం పరిధిలోని అంశం: యనమల

విజయవాడ: రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌నేత యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పునర్విభజన చట్టంలో.. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ సిఫార్సుల మేర రాజధాని ఏర్పాటు కావాలని ఉంది. అందుకు అనుగుణంగానే శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుంది. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంది, రాజధానులు అని లేదు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా 3 రాజధానులు చేయాలంటే విభజన చట్టంలో సవరణ అవసరం. ఈ అంశాలన్నీ గవర్నర్‌ పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలి. వివాదాస్పద బిల్లులపై భిన్నాభిప్రాయాలు ఉన్నందుకే కేంద్రం సలహా తీసుకోవాలని కోరాం. ప్రభుత్వం ఓసారి చట్టం అయిందని భావించాక ఇక అది రాష్ట్రపతికి పంపాలా లేక న్యాయ సలహా కోరాలా అనేది గవర్నర్‌ ఇష్టం’’ అని యనమల వివరించారు.

ఆ రెండు బిల్లులు పెండింగ్‌లోనే...

‘‘పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రజలకు సంబంధించిన బిల్లులకు మండలి ఆమోదం లేదా తిరస్కరణ అవసరం. తిరస్కరిస్తే డీమడ్‌ టు బీ పాస్డ్‌ చేయవచ్చు. రెండు బిల్లులకు మండలి ఆమోదం లేదా తిరస్కరణ లభించలేదు. ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్‌ కమిటీ పెండింగ్‌లో ఉన్నాయి. గవర్నర్‌ కూడా దీనిపై ప్రజాభిప్రాయం, న్యాయ సలహా తీసుకోవాలి. ప్రజాభిప్రాయం తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది. సెలక్ట్‌ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న రెండు బిల్లులను మళ్లీ సభ ముందుకు తీసుకురావడం తగదు. ప్రభుత్వం తన అభిప్రాయాలను ప్రజలపై రుద్దాల్సిన అవసరం ఏముంది?’’ అని యనమల ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని