
తాజా వార్తలు
మెట్టవలసలో వైకాపా, తెదేపా రాళ్లదాడి
జి.సిగడాం: పంచాయతీ ఎన్నికల పోరు పల్లెల్లో చిచ్చు రేపింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మెట్టవలస గ్రామంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెట్టవలస పంచాయతీలో రెండు రోజుల కిందట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపొందారు. ఈ నేపథ్యంలో వైకాపా వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెదేపా వర్గీయులు ఆరోపించారు. దీనిపై వారు వైకాపా వర్గీయులను నిలదీశారు.
దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన 20 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రాజాం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని రాజాంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెట్టవలస గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.