‘జనాభా’బిల్లు: యోగిపై ప్రతిపక్షాల విమర్శలు

తాజా వార్తలు

Updated : 12/07/2021 05:49 IST

‘జనాభా’బిల్లు: యోగిపై ప్రతిపక్షాల విమర్శలు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో జనాభాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘జనాభా నియంత్రణ బిల్లు-2021’ను తీసుకురానున్న విషయం తెలిసిందే. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ జనాభా నియంత్రణ బిల్లు వివరాలను విడుదల చేశారు. కాగా.. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఈ బిల్లు అమల్లోకి వస్తే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికీ అర్హత ఉండదు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి భవిష్యత్తులో ఎలాంటి పదోన్నతులు లభించవు. ప్రభుత్వం నుంచి పథకాలు పొందడానికి వీల్లేదు. ఇద్దరు పిల్లల నిబంధన పాటించే ప్రభుత్వ ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 12 నెలలు మాతృత్వ, పితృత్వ సెలవులు మంజూరు చేస్తారు. అంతేకాకుండా.. జాతీయ పింఛను పథకంలో అదనంగా మూడుశాతం జమ చేస్తారు. ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటే రాయితీ లభిస్తుంది. ఇక ఒక్కరే సంతానం ఉంటే నాలుగు అదనపు ఇంక్రిమెంట్లతో పాటు.. చిన్నారికి 20 ఏళ్లు వచ్చేవరకు ఉచిత విద్య, ఆరోగ్యసేవలు అందించనున్నారు.

ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: ప్రతిపక్షాలు

యోగీ ప్రభుత్వం తీసుకొస్తున్న జనాభా నియంత్రణ బిల్లుపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్‌ సిన్హా మాట్లాడుతూ ‘‘ఈ బిల్లును అమలు చేయడమంటే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం’’అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి అశోక్‌ సింగ్‌ ట్విటర్‌ వేదికగా యూపీ సర్కార్‌పై విమర్శలు చేశారు. ‘‘జనాభా పెరుగుదలపై ఆర్‌ఎస్ఎస్‌, భాజపా నేతలు మాట్లాడుతున్నారు. జనాభా నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. కానీ, యోగి ఆదిత్యనాథ్ దీన్ని రాజకీయ అజెండాగా మార్చేశారు. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును తీసుకొస్తున్నారు’’అని ఆక్షేపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని