Huzurabad By Election: తెరాసను ఓడించేందుకు కమలం, హస్తం దోస్తీ

ప్రధానాంశాలు

Huzurabad By Election: తెరాసను ఓడించేందుకు కమలం, హస్తం దోస్తీ

మంత్రి హరీశ్‌రావు ధ్వజం

పేదల సంక్షేమమే లక్ష్యం: గెల్లు

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: రానున్న ఉపఎన్నికలో గ్యాస్‌ బండకు దండం పెట్టి భాజపాకు గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం కనుకులగిద్ద, జూపాక, బొత్తలపల్లి, ఇందిరానగర్‌, శాలపల్లి, రాజపల్లి, రంగాపూర్‌, రాంపూర్‌, చెల్పూరు గ్రామాల్లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు ఆయన సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భాజపా పుణ్యమా అని గ్యాస్‌ బండ ధర అనూహ్యంగా పెరిగిందన్నారు. దీనిపై భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 21 రోజుల్లో 16సార్లు గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ఘనత భాజపాకు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టాలనే పార్టీ ఈటల రాజేందర్‌ది కాగా, వాటిని బిగించబోమని తేల్చిచెప్పే పార్టీ తెరాస అని తెలిపారు. తెరాసను ఓడించేందుకు కమలం, హస్తం దోస్తీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న పార్టీ తెరాస అని గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు తెరాసలో సముచిత స్థానం కల్పించినప్పటికీ కేసీఆర్‌పై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని