KTR: విజయగర్జన చరిత్రలో నిలవాలి

ప్రధానాంశాలు

KTR: విజయగర్జన చరిత్రలో నిలవాలి

ప్రజాభిమానాన్ని ప్రతిబింబించాలి

పల్లెలు, పట్టణాలు, నగరాలు కదలాలి

ఆహ్వానితులకే ప్లీనరీ ప్రవేశం

మంత్రులు, నేతలతో కేటీఆర్‌ సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ల పండుగను పురస్కరించుకొని వచ్చే నెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన చరిత్రలో నిలిచిపోవాలని, కరీంనగర్‌లో జరిగిన సింహగర్జన సభను మించి విజయవంతం చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు మంత్రులు, పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కల సాకారం చేసిన నాయకుడు కేసీఆర్‌ అద్భుత పాలనతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, చిరునవ్వులతో జీవించేలా చేస్తూ, వారి గుండెల్లో నిలుస్తున్నారని, ఆయనపై అభిమానాన్ని చాటేలా బ్రహ్మాండంగా సభ జరగాలని సూచించారు. ప్రతి పల్లె, పట్టణం, నగరాలు సభ వైపు కదలాలని, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని కోరారు. విజయగర్జన సభ, ఈ నెల 25న జరిగే ప్లీనరీ సన్నాహాల్లో భాగంగా వాటి ఇన్‌ఛార్జిగా కేటీఆర్‌ సోమవారం తెలంగాణ భవన్‌లో సిరిసిల్ల, కోరుట్ల, దుబ్బాక, సంగారెడ్డి, వికారాబాద్‌, పరిగి, తాండూరు, చేవెళ్ల, సూర్యాపేట, హుజూర్‌నగర్‌, దేవరకొండ, తుంగతుర్తి, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌, అలంపూర్‌, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌, ఎల్లారెడ్డి.. మొత్తం 20 నియోజకవర్గాలకు చెందిన మంత్రులు, నేతలతో ఆయన సమావేశమయ్యారు. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, సబితారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు.

మరుపు రానివిగా నిలవాలి

‘‘ద్విదశాబ్ది సంవత్సరంలో జరిగే ప్లీనరీ, విజయగర్జన సభలు ముఖ్యమైన ఘట్టాలు. ఇవి మరుపురానివిగా నిలవాలి. అధ్యక్షుడు కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు శిరోధార్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలి. తెలంగాణ వైపు ఇప్పుడు దేశమంతా చూస్తోంది. వినూత్న పథకాలు, కార్యక్రమాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమాంతరంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. సీఎం కేసీఆర్‌, ప్రభుత్వ తపనను ప్రజలు గుర్తించి ప్రతి ఎన్నికల్లోనూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకుపోయేందుకు శ్రేణులు కృషి చేయాలి. విజయగర్జన సభను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నాం. మంత్రులు.. జిల్లా ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలి. ఆహ్వానితులకు మాత్రమే ప్లీనరీలో ప్రవేశం. ఒకటి, రెండురోజుల్లో ఆహ్వానం పంపుతాం. గ్రామ, మండల స్థాయి కార్యకర్తల సమావేశాల అనంతరం ఈనెల 27న జరిగే నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలను పూర్తి చేయాలి. విజయగర్జన సభకు ప్రజలను సమీకరించాలి. బస్సుల వివరాలను అందజేస్తాం. గ్రామకమిటీల ఆధ్వర్యంలో వారికి సమాచారం ఇచ్చి ప్రజలు వాటిల్లో ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి’’ అని సూచించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని