KTR: సమయం, సందర్భాన్ని బట్టి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌

ప్రధానాంశాలు

KTR: సమయం, సందర్భాన్ని బట్టి జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌

దళితబంధును ఆపడం ఎవరితరం కాదు

తెరాసపై రేవంత్‌, ఈటల కుట్ర

హుజూరాబాద్‌లో కచ్చితంగా మాదే విజయం

జానారెడ్డినే ఓడించాం.. ఈటల మాకో లెక్క కాదు 

ఇష్టాగోష్ఠిలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సమయం, సందర్భాన్ని బట్టి తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి అనేది వాట్సప్‌ యూనివర్సిటీ ప్రచారమే తప్ప నిజం లేదని చెప్పారు. ప్రపంచంలోని అతి గొప్ప పథకాల్లో ఒకటైన దళితబంధును ఆపడం ఎవరి తరం కాదన్నారు. నవంబరు 3 తర్వాత అది రాష్ట్రమంతటా యథాతథంగా కొనసాగుతుందన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

కావాలనే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలిపింది

‘‘నాగార్జునసాగర్‌లో సీనియర్‌ కాంగ్రెస్‌నేత జానారెడ్డిని ఓడించాం... ఈటల రాజేందర్‌ అంతకన్నా గొప్ప నేతేం కాదు. హుజూరాబాద్‌లో తెరాస కచ్చితంగా గెలుస్తుంది. రేవంత్‌, ఈటల తదితరులు తెరాసపై కుట్రకు తెరలేపారు. కావాలనే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలిపింది.ఈటలకు ఓటెయ్యాలని ఓ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లేఖ రాయడం కుమ్మక్కులో భాగమే. టీపీసీసీ అధ్యక్షునిగా తొలి ఉపఎన్నిక కోసం హుజూరాబాద్‌కు వెళ్లకుండా రేవంత్‌ చిలకజోస్యం చెబుతున్నారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న రేవంత్‌ ఆ పని చేయలేదు. దమ్ముంటే ఇప్పుడైనా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్‌ తెచ్చుకోవాలి. ఈటల బలవంతంగా భాజపా బురదను అంటించుకున్నారు. ఆ పార్టీని మాత్రం సొంతం చేసుకోవడం లేదు. ఓడిపోతామనే భయంతో జైశ్రీరామ్‌ అనడం లేదు. తెరాస ఎంతో చేసినా పార్టీకి ఎందుకు రాజీనామా ఇచ్చారో రాజేందర్‌ చెప్పడంలేదు. వేరే విషయాలు మాట్లాడుతున్నారు. ఎన్నికల తర్వాత ఈటల, వివేక్‌, ఇతర నేతలు గంపగుత్తగా కాంగ్రెస్‌లో చేరతారు.నేను హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లడం లేదు. దానికి అపార్థాలు ఆపాదించవద్దు. గతంలో నాగార్జునసాగర్‌, దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేదు. ఉపఎన్నికలో సీఎం కేసీఆర్‌ ప్రచారం షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదు. వచ్చే నెల 15న వరంగల్‌లో విజయగర్జన సభ దృష్ట్యా ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది. అందువల్ల ఆరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక చాలా చిన్నది

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక చాలా చిన్నది. ప్రజల ఆలోచనలకు అది ప్రతిబింబం. అక్కడా మేమే గెలుస్తాం. ఇలా తెరాస ఎన్నో విజయాలు సాధించింది. ప్రాంతీయ పార్టీలు ఇరవయ్యేళ్లు మనగలగడం గొప్ప విషయం. ఎన్టీఆర్‌ పెట్టిన తెదేపా, కేసీఆర్‌ తెరాస మాత్రమే ముందుకు సాగుతున్నాయి. నియోజకవర్గాల్లో గ్రూపులు పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శనం. అన్నింటినీ అధిగమిస్తాం. నియోజకవర్గ నేతలతో జరుగుతున్న సమావేశాల్లోని అంశాలను కేసీఆర్‌కు తెలియజేస్తా.

తొమ్మిది నెలలపాటు పార్టీ కార్యక్రమాలు

ప్లీనరీ, తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.గతంలో ప్రభుత్వానికే ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల పార్టీ కార్యక్రమాలు కొంత తగ్గాయి. ఇప్పుడు పెంచుతున్నాం. 9 నెలల పాటు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తాం. జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం తర్వాత శిక్షణ తరగతులు ఉంటాయి. వరంగల్‌ మాకు కలిసొచ్చిన ప్రాంతం. అక్కడ ఎన్నో సభలు పెట్టి విజయవంతం చేశాం.విజయగర్జన గొప్ప సభల్లో ఒకటిగా మిగిలి పోతుంది. ఈ నెల 25న హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో జరిగే తెరాస ప్లీనరీకి  ప్రతినిధులు గులాబీ చొక్కా, చీరలు ధరించి రావాలి.

నవంబరు 15 తర్వాత తమిళనాడుకు

నవంబరు 15 తర్వాత తమిళనాడుకు వెళ్లి డీఎంకే, అన్నాడీఎంకేల నిర్మాణాన్ని అధ్యయనం చేస్తాం. నీట్‌ రద్దుపై స్టాలిన్‌తో 100 శాతం ఏకీభవించలేం. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. రాష్ట్ర విద్యార్థులకు మేలైన నిర్ణయం తీసుకుంటాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని