close

ప్రధానాంశాలు

తెరాస హల్‌సెల్‌

అభ్యర్థుల ఫోన్‌ నంబర్లతో పార్టీ అధిష్ఠానం అనుసంధానం
రోజూ కేసీఆర్‌, కేటీఆర్‌ల సందేశాలు
ఆడియో, వీడియో, ఛాయాచిత్రాల ద్వారా సమాచార పంపిణీ
కేటీఆర్‌ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: పుర, నగర పాలక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి అధిష్ఠానం సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్‌ అభ్యర్థులకు నేరుగా దిశానిర్దేశం చేయనుంది. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రచార వ్యూహాన్ని వెల్లడిస్తూ వారిని కార్యోన్ముఖులను చేయనుంది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమైంది. పార్టీ సమన్వయకమిటీ, సామాజిక మాధ్యమాల విభాగాలు దీనిలో భాగస్వామ్యం కానున్నాయి. కేటీఆర్‌ మంగళవారం ఉదయం దీనిపై కమిటీలతో సమావేశమై సూచనలు చేశారు. సాయంత్రం నుంచి కార్యాచరణ మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వార్డులు, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫోన్‌ నంబర్లు, ఇతర సమాచారాన్ని తీసుకున్నారు. ఏకగ్రీవమైన వారి వివరాలను మినహాయించారు. జిల్లాల వారీగా పోటీలో ఉన్న వారందరితో కలిసి వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు. టెలిగ్రాం గ్రూపు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో అధిష్ఠానం ఉంది.  ఈ గ్రూపుల్లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌ఛార్జులు, సమన్వయ కమిటీల నేతలు కూడా ఉంటారు.

రోజూ ఉదయమే...
అభ్యర్థులందరికీ ప్రతి రోజు ఉదయమే ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల సందేశం అందుతుంది. వార్డుల పరిధిలో ఏ రోజు ఏయే ప్రాంతాల్లో, ఏయే అంశాలపై ప్రచారం చేయాలి అనే సమాచారాన్ని ఆడియో, వీడియో, చిత్రాల రూపంలో అధిష్ఠానం పుంపుతుంది. పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పింఛన్లు, నిరంతర విద్యుత్‌, మిషన్‌ భగీరథ, సిమెంటు రోడ్లు, వీధిదీపాలు ఇతర అంశాలపై సమాచారమిస్తారు. వీటిని ప్రతి అభ్యర్థి ప్రచారంలో ప్రస్తావించాలని నిర్దేశిస్తారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి అవసరమైన అంశాలను సూచిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థులెవరైనా అధిష్ఠానం నుంచి వచ్చే ఫోన్‌ సమాచారాన్ని చూడకపోయినా, పట్టించుకోకపోయినా దానిని పార్టీ సామాజిక మాధ్యమాల విభాగం గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులకు అందజేసి, వారిని అప్రమత్తం చేస్తుంది.

అభ్యర్థులతో సంభాషణ
ఫోన్‌ ద్వారా వచ్చిన సందేశాన్ని అభ్యర్థులు ఆచరించారా?లేదా? అని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రతిరోజు సమీక్షిస్తారు. కొందరు అభ్యర్థులతోనూ ఆయన మాట్లాడతారు. ఏదైనా ఒక రోజు ముఖ్యమంత్రి సైతం అభ్యర్థులతో మాట్లాడే వీలుంది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.