close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘మహా’ కూటమిలో లుకలుకలు

కాంగ్రెస్‌కి అక్కడ కీలక పాత్రేమీ లేదన్న రాహుల్‌ గాంధీ
ప్రభుత్వానికి ఢోకా లేదు: శివసేన

ఈనాడు-దిల్లీ: మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. కూటమిలో తాము కీలకమైన విధాన నిర్ణేతలమేమీ కాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మంగళవారం నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరిల్లో మా పార్టీ.. నిర్ణాయక శక్తి. మహారాష్ట్రలో మాత్రం కేవలం ప్రభుత్వానికి మద్దతుదారు. ప్రభుత్వాన్ని నడపడం, ఒక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మధ్య వ్యత్యాసం ఉంది’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) మధ్య అంతరం పెరుగుతోందన్న వార్తలతో తమకు సంబంధం లేదన్నట్లు ఆయన స్పందించారు. దాని పరిణామాలు మాత్రం మరో విధంగా మారాయి. అధికార కూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య విశ్వాసం లోపించిందని భాజపా నేతలు విమర్శలు అందుకున్నారు. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే నామమాత్ర పాత్రేనని రాహుల్‌ ఎలా చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ వ్యాఖ్యతో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అంగీకరించినా అదే పార్టీకి చెందిన మరో కీలక నేత మజీద్‌ మెమన్‌ మాత్రం విభేదించారు. ప్రభుత్వంలో కాంగ్రెస్‌ చేరి, కీలకమైన పదవులనూ చేపట్టిన దృష్ట్యా నిర్ణయాల్లో ఆ పార్టీ పాత్ర ఉన్నట్లే అవుతుందని చెప్పారు. రాహుల్‌ వ్యాఖ్యల్ని తప్పుగా ఉటంకించారంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నా శివసేన-ఎన్సీపీ మధ్య అగాధం పెరుగుతోందన్న ఊహాగానాలకు కళ్లెం పడలేదు.

విభేదాలకు కారణాలు ఇవీ...
సేన-ఎన్సీపీ విభేదాలకు ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
1) మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ను క్రమేపీ సడలించి, ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడమే మేలని ఎన్సీపీ భావిస్తోంది. అలా చేస్తే ప్రజల ఆరోగ్యాలకు, ప్రాణాలకు ముప్పు అని సేన విశ్వసిస్తోంది.
2) ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆయన నివాసమైన ‘మాతోశ్రీ’ నుంచి కాకుండా ‘మంత్రాలయ’ నుంచి పరిపాలన సాగించాలని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ గట్టిగా పట్టుపడుతున్నారు. సీఎం మాదిరిగానే మిగతా మంత్రులూ ఇంటివద్ద నుంచే పనిచేస్తున్న పరిస్థితి మారాలని ఆయన వాదన.
3) మాజీ సీఎం ఫడణవీస్‌ నేతృత్వంలో భాజపా ప్రతినిధి బృందం ఇటీవల గవర్నర్‌ను కలిసింది. కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది.

అస్థిరతకు భాజపా ప్రయత్నం: పవార్‌
సంకీర్ణ లుకలుకల నేపథ్యంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీని సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో పవార్‌ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్‌ ఆహ్వానం మేరకే తమనేత వెళ్లారని, ఎలాంటి రాజకీయాంశాలూ చర్చకు రాలేదని పార్టీ చెబుతున్నా... ఇలాంటి సమయంలో భేటీ జరగడం అనేక ఊహాగానాలకు తెరతీసింది. అధికారం కోల్పోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తట్టుకోలేకపోతున్నారనీ, తమ కూటమి పూర్తికాలం అధికారంలో ఉంటుందని పవార్‌ చెబుతున్నారు. ముఖ్యమంత్రిని చూడాలనుకుంటున్నట్లు గవర్నర్‌ అన్నప్పటికీ ఠాక్రే వెళ్లకుండా పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను పంపించారు. గవర్నర్‌తో భేటీ తర్వాత ముఖ్యమంత్రితో సోమవారం రాత్రి పవార్‌ గంటన్నర సేపు సమావేశమయ్యారు. ఆ భేటీలో కాంగ్రెస్‌ నేతలెవరూ లేరు. సర్కారును అస్థిరపరిచి, కూలదోసేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్నది పవార్‌ ఆరోపణ.

విపక్షాలను క్వారంటైన్‌ చేయాలి: రౌత్‌
ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా అనుకుంటున్నా అవి ఆ పార్టీకే ఎదురుదెబ్బ కొడతాయని రౌత్‌ మండిపడ్డారు. విపక్షాలను క్వారంటైన్‌ చేయాలన్నారు. సంకీర్ణ ప్రభుత్వం బలంగానే ఉందని, ఎలాంటి అస్థిరతా లేదని ఆయన ట్వీట్‌ చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని భాజపా ఎంపీ నారాయణ రాణె చేసిన డిమాండును తోసిపుచ్చారు. భాజపా ప్రభుత్వం గుజరాత్‌లో కరోనాకు కళ్లెం వేయలేకపోయిందనీ, ముందుగా అక్కడే రాష్ట్రపతి పాలన విధించాలని తిప్పికొట్టారు. సర్కారుకేమీ ఢోకా లేదని పీసీసీ అధ్యక్షుడు బాలాసాహెబ్‌ థొరాట్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తామేమీ వేగిరపడడం లేదనీ, ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫడణవీస్‌ ఖండించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.