close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెరాస మరో వందేళ్లు చెక్కుచెదరదు

కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా ఆదుకుంటాం
60 లక్షల మందికి ప్రమాద బీమా
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పదమూడు సంవత్సరాలు కుట్రలను ఛేదించుకొని నిలదొక్కుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. మరో వందేళ్ల పాటు చెక్కుచెదరని బలంతో పటిష్ఠంగా ఉంటుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధితో ప్రజల కళ్లలో సంతోషం చూడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ ఉన్నతికి కారణమైన కార్యకర్తలను కంటికి రెప్పగా కాపాడుకుంటామని.. ఏ ఒక్కరు కష్టంలో ఉన్నా ఆదుకుంటామని చెప్పారు. 60 లక్షల మంది తెరాస కార్యకర్తలకు ప్రమాద బీమా కోసం రూ.16,11,19,199 ప్రీమియం చెక్కును శనివారం తెలంగాణ భవన్‌లో యునైటెడ్‌ ఇండియా బీమా సంస్థ ప్రతినిధులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌ సంకల్ప బలం, ముహూర్తం వల్లే తెరాస అజేయ రాజకీయశక్తిగా, పటిష్ఠంగా ఎదిగింది. దీనికి కర్త, కర్మ, క్రియ.. కేసీఆరే. చంద్రబాబు పాలనలో ‘జలదృశ్యం’ నుంచి మమ్మల్ని రోడ్డుపైకి గెంటేశారు. ముహూర్త బలంతో ఈ రోజు హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ భవన్‌లో 60 లక్షల మందికి బీమా ఇచ్చే స్థాయికి చేరాం. తెరాస కార్యకర్తలు ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ఆటుపోట్లను తట్టుకొని.. శ్రమ, పట్టుదల, త్యాగాలతో పార్టీని ఇంతెత్తుకు తెచ్చారు. ఎమ్మెల్యేలు వారి ఇళ్లకు వెళ్లి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలి. ఇప్పటివరకు కార్యకర్తల బీమా కోసం రూ.47.65 కోట్లు చెల్లించాం. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భవనాలు దాదాపు పూర్తయ్యాయి. త్వరలో వాటిని ప్రారంభిస్తాం. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం తెరాసయే. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా కార్యకర్తలు ఉండాలి. జన్మదినం సందర్భంగా నేను నా నియోజకవర్గానికి 6 అంబులెన్సులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో మిగతా నాయకులు సైతం ముందుకొచ్చి 100కి పైగా సమకూర్చారు. తెలంగాణ కాంగ్రెస్‌, భాజపా నేతలకు పదవులు దక్కడం తెరాస పుణ్యమే. రాష్ట్ర ముఖ్యమంత్రి    కేసీఆర్‌పై మాట తూలేముందు వారు ఈ విషయం గుర్తుంచుకోవాలి’’అని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చీఫ్‌ విప్‌ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

సిరిసిల్లపై డాక్యుమెంటరీ విడుదల
తెరాస నాయకుడు ఉప్పల శ్రీనివాస్‌ నిర్మించిన సిరిసిల్ల పురోగమనం (రైజ్‌ ఆఫ్‌ సిరిసిల్ల) డాక్యుమెంటరీని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విడుదల చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ మాలోతు కవిత, డాక్యుమెంటరీ దర్శకుడు పూర్ణచందర్‌ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ను కలవగా.. డాక్యుమెంటరీని చక్కగా రూపొందించారంటూ అభినందించారు.


కరోనా ఇప్పట్లో పోయేలా లేదు

రాష్ట్రంలో కరోనా ఇప్పట్లో పోయేలా లేదని, మరికొన్ని నెలలపాటు ఉండే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని.. ఎక్కడ ఎలాంటి అవసరమున్నా వెంటనే స్పందించాలని సూచించారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా వివిధ కారణాలతో కేసులు పెరుగుతున్నాయి. వైరస్‌ కట్టడి చర్యల్లో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి. ప్లాస్మా దాతలపై దృష్టి సారించాలి. కాంగ్రెస్‌ నాయకులు ఏం మాట్లాడినా తిప్పికొట్టండి. భాజపా నాయకులను పట్టించుకోవద్దు’’ అని చెప్పారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.