సాక్షులకు భద్రత కల్పించండి

ప్రధానాంశాలు

సాక్షులకు భద్రత కల్పించండి

లఖింపుర్‌ ఖేరి ఘటనలో ఉత్తర్‌ప్రదేశ్‌కి సుప్రీంకోర్టు ఆదేశం

సాక్ష్యం చెప్పడానికి 23 మందేనా?: జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, దిల్లీ: లఖింపుర్‌ ఖేరి ఘటనలో సాక్షులకు గట్టి భద్రత కల్పించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన సాక్షుల వాంగ్మూలాలను వేగంగా నమోదు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3న యూపీలోని లఖింపుర్‌ ఖేరిలో చోటు చేసుకున్న ఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం మీద యూపీ ప్రభుత్వం సమర్పించిన స్థాయీ నివేదికపై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. వాదనలు మొదలైన వెంటనే జస్టిస్‌ రమణ జోక్యం చేసుకుంటూ- ‘‘ఒక నిందితుడు మినహా మిగిలిన నిందితులందర్నీ పోలీసు కస్టడీలో ఎందుకు ఉంచారు? విచారణను సాగదీయాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు. సాక్షుల వాంగ్మూలాల నమోదు నేపథ్యంలో ఆ పనిచేయాల్సి వచ్చిందని యూపీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ గరిమా ప్రసాద్‌ చెప్పారు. 68 మంది సాక్షుల్లో ఇప్పటివరకు 30 మంది వాంగ్మూలాలను సీఆర్‌పీసీ 164 నిబంధన కింద రికార్డు చేశారని, అందులో 23 మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే తెలిపారు.

వారి సాక్ష్యాలకు ఎక్కువ విశ్వసనీయత

‘‘ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మందే ఉన్నారా? ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? అని దర్యాప్తు అధికారులను అడగండి. సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారి సాక్ష్యాలకు ఎక్కువ విశ్వసనీయత ఉంటుంది. వారి నుంచి వివరాలు సేకరించడమే మంచిది. ఘటనలో గాయపడినవారిలో ఎవరైనా వాంగ్మూలాలు ఇచ్చిన వారిలో ఉన్నారా?’’ అని సీజేఐ ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్‌ డేటా పరీక్షను వేగవంతం చేయాలని, లేదంటే తామే ప్రయోగశాలలకు ఉత్తర్వులిస్తామని చెప్పారు. లఖింపుర్‌ ఖేరి ప్రధాన ఘటన అనంతరం తన భర్త శ్యాంసుందర్‌ హత్యకు గురయ్యారనీ, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో నిందితులు తనను బెదిరిస్తున్నారని రూబీదేవి అనే మహిళ సీజేఐ ధర్మాసనానికి తెలిపారు. దీనిపై యూపీ సర్కారు తరఫు న్యాయవాదుల్ని జస్టిస్‌ రమణ ప్రశ్నించారు. ఈ అంశంపైనా, ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయునికి సంబంధించిన వివరాలను తదుపరి విచారణలో చెప్పాలని ఆదేశిస్తూ, కేసును నవంబరు 8కి వాయిదా వేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని