Aryan Khan: బెయిలు కోసం ఎదురుచూపులే

ప్రధానాంశాలు

Aryan Khan: బెయిలు కోసం ఎదురుచూపులే

ఆర్యన్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో నేడు కొనసాగనున్న విచారణ

అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియాతో ఆయనకు సంబంధాలు!: ఎన్‌సీబీ

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బెయిలు కోసం బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఆయన దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. బుధవారం కూడా వాదనలు ఆలకించనున్నట్లు తెలిపింది. అంతకుముందు, ఆర్యన్‌ తరఫున మాజీ అటార్నీ జనరల్‌, సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఆర్యన్‌ డ్రగ్స్‌ వినియోగించినట్లు ఎన్‌సీబీ వద్ద సాక్ష్యాధారాలేవీ లేవని పేర్కొన్నారు. ఆయన నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోలేదనీ చెప్పారు. ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచారని వాదించారు. ఆర్యన్‌ 2018, 2019, 2020ల్లో వాట్సప్‌ వేదికగా చేసిన చాట్‌లను ఈ కేసుతో ముడిపెట్టి చూడటం సరికాదన్నారు. మరోవైపు- ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే, కొంతమంది రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆర్యన్‌కు సంబంధం లేదని తేల్చిచెప్తూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో అదనపు పత్రాన్ని సమర్పించారు. వాంఖడే సహా ఎన్‌సీబీ అధికారులెవరిపైనా షారుక్‌ కుమారుడికి ఫిర్యాదుల్లేవని అందులో పేర్కొన్నారు. వాంఖడే, ఇతరులపై ముడుపుల ఆరోపణలు చేసిన ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సాయీల్‌తోనూ ఆర్యన్‌కు సంబంధాల్లేవని స్పష్టం చేశారు.

డ్రగ్స్‌ వినియోగదారుడే కాదు.. రవాణాదారు కూడా..

ఆర్యన్‌ బెయిలు దరఖాస్తును ఎన్‌సీబీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన డ్రగ్స్‌ వినియోగదారుడు మాత్రమే కాదని, వాటి అక్రమ రవాణాలోనూ ప్రమేయమున్నవాడని హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు మంగళవారం ప్రమాణ పత్రం సమర్పించింది. షారుక్‌ ఖాన్‌ మేనేజర్‌ పూజా దద్లానీ, ఆర్యన్‌.. సాక్షులను ప్రభావితం చేస్తూ కేసు దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో ఆరోపించింది. ఎన్‌సీబీ అధికారులపై ముడుపుల ఆరోపణలు చేసిన ప్రత్యక్ష సాక్షి ప్రభాకర్‌ సాయీల్‌ వ్యవహారాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. ఆర్యన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. నౌకలో ఆర్యన్‌ వద్ద మాదకద్రవ్యాలు దొరకనంత మాత్రాన ఆయన్ను వదిలేయలేమని పేర్కొంది. ముంబయి నౌక డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఈ నెల 3న అరెస్టయ్యారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న అర్బాజ్‌ మర్చంట్‌, మున్మున్‌ ధమేచాల బెయిలు పిటిషన్లపై కూడా బాంబే హైకోర్టు బుధవారం వాదనలు విననుంది.

ఇద్దరు నిందితులకు బెయిలు

ముంబయి నౌక డ్రగ్స్‌ కేసులో మనీష్‌ రాజ్‌గరియా, అవిన్‌ సాహు అనే ఇద్దరు నిందితులకు మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల (ఎన్‌డీపీఎస్‌) చట్టం ప్రత్యేక కోర్టు తాజాగా బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో మొత్తం 20 మంది అరెస్టవగా.. ఇప్పటివరకు బెయిలు దొరికింది వీరిద్దరికే కావడం గమనార్హం.


కిక్కిరిసిన కోర్టు గది.. కాసేపు బయటకు వెళ్లిన న్యాయమూర్తి

ఆర్యన్‌ బెయిలు పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం కోర్టు గది న్యాయవాదులు, పాత్రికేయులతో కిక్కిరిసిపోయింది. కొవిడ్‌ నియంత్రణ మార్గదర్శకాలను ఎవరూ ఖాతరు చేయలేదు! దీంతో.. అక్కడ వెంటనే విచారణ జరగనున్న కేసులకు సంబంధించిన న్యాయవాదులు మినహా మిగతావారిని బయటకు పంపించాలని న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.డబ్ల్యూ.సాంబ్రె తన సిబ్బందికి సూచించారు. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. ఆ వెంటనే న్యాయమూర్తి వేదికను వీడి కొద్దిసేపు కారిడార్‌లోకి వెళ్లారు. పలువురు న్యాయవాదులు, పాత్రికేయులు కోర్టు గది నుంచి వెళ్లిపోయాక తిరిగి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం పాత్రికేయులను పోలీసులు/సిబ్బంది మళ్లీ గదిలోకి అనుమతించారు. లోపల ఉన్నవారు మాట్లాడటం వల్ల ముకుల్‌ రోహత్గీ వాదనలకు పదేపదే అంతరాయం ఏర్పడింది. ఒక దశలో కోర్టు గదిలో తోపులాట చోటుచేసుకొని, తలుపు విరగడం గమనార్హం.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని