5-స్టార్‌ సంస్కృతి పోవాలి

ప్రధానాంశాలు

5-స్టార్‌ సంస్కృతి పోవాలి

  కీలక పదవులకు  అంతర్గత ఎన్నికలు జరపాలి
  గులాం నబీ ఆజాద్‌ డిమాండ్‌

దిల్లీ: కాంగ్రెస్‌ పనితీరుపై సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మరోసారి గళమెత్తారు. జాతీయ స్థాయిలో సమర్థమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని డిమాండు చేశారు. ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పార్టీలో ‘5-స్టార్‌ సంస్కృతి’ పోవాలని అన్నారు. ‘‘ప్రస్తుత సమస్య ఏమిటంటే..పార్టీ టిక్కెట్‌ పొందిన వారు తొలుత 5-స్టార్‌ హోటళ్లలో దిగుతున్నారు. గతుకుల రోడ్డు ఉంటే కారులో ప్రయాణించడానికి ఇష్టపడడం లేదు. ముందు ఈ విధానం మారాలి’’ అని అన్నారు. ‘‘ప్రతి నాయకునికీ ప్రతి ఒక్క నియోజకవర్గం గురించి తెలియాలి. దిల్లీ నుంచి వెళ్లి రెండు మూడు రోజుల పాటు 5-స్టార్‌ హోటల్‌లో ఉండి తిరిగి రావడం వల్ల ప్రయోజనం లేదు. డబ్బు వృథా తప్ప...’’ అని వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమికి నాయకత్వంపై తాను నింద మోపడం లేదని చెప్పారు. పార్టీ శ్రేణులు ప్రజలతో సంబంధాలు కోల్పోవడమే ఇందుకు కారణమని అన్నారు. ‘‘ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఎవరైనా ఎలాంటి పదవైనా పొందడానికి అవకాశం ఉంది. కీలక పదవుల్లో నియామకాలే జరుగుతున్నాయి. పదవులు పొందిన వారు ఎక్కడికీ వెళ్లడం లేదు. అదే ఆ పదవులన్నింటికీ ఎన్నికలు నిర్వహిస్తే తమ కర్తవ్యాలు ఏమిటో వారు గుర్తించగలుగుతారు’’ అని అభిప్రాయపడ్డారు. ప్రతిస్థాయిలోనూ పార్టీ పనితీరును మార్చాల్సి ఉందని అన్నారు.
పార్టీలో తిరుగుబాట్లు లేవు
పార్టీలో ఎలాంటి తిరుగుబాట్లు లేవని స్పష్టంచేశారు. ‘‘తిరుగుబాటు అంటే ఒకరిని తొలగించి మరొకరని పెట్టడం. పార్టీ అధ్యక్ష పదవికి ఇతర వ్యక్తులు ఎవరూ లేరు. ఇది తిరుగుబాటు కాదు. సంస్కరణలు’’ అని వివరించారు. కాకా పట్టే సంస్కృతి కారణంగానే పార్టీ నష్టపోయిందని, దీన్ని రూపుమాపాల్సి ఉందని అన్నారు. పార్టీలో ఆత్మపరిశీలన జరగాలని సీనియర్లు కోరుతున్నారని, దీనర్థం వారు సోనియా, రాహుల్‌లను వ్యతిరేకిస్తున్నట్టు కాదని వివరణ ఇచ్చారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని