close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మోదీజీ.. జీడీపీ అదిరిందిగా!

గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపుపై రాహుల్‌ వ్యంగ్యాస్త్రం
6.5 ఏళ్లలో రూ.20 లక్షల కోట్ల ఎక్సైజ్‌ సుంకం

దిల్లీ: ‘మోదీజీ జీడీపీ వృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధించారు. ఇక్కడ జీడీపీ అంటే.. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌’ అంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదివారం హిందీలో ట్వీట్‌ చేశారు. ఆర్థికమాంద్యంతో ప్రజలు బాధలు పడుతుంటే.. మోదీ ప్రభుత్వం పన్ను వసూళ్లలో నిమగ్నమై ఉందంటూ ధ్వజమెత్తారు. వారంలో నాలుగోసారి పెట్రో ధరలు పెరగడమే కాకుండా, మునుపెన్నడూ లేనంత గరిష్ఠస్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు విరుచుకుపడ్డారు. తాజా పెంపుతో లీటరు పెట్రోలు ధర దిల్లీలో రూ.85.70, ముంబయిలో రూ.92.28కి చేరింది. లీటరు డీజిలు ధర దిల్లీలో 75.88, ముంబయిలో రూ.82.66కు చేరింది. మోదీ పాలనలో పెంచుకొంటూ పోయిన ఎక్సైజ్‌ సుంకాన్ని తక్షణం తగ్గించి, వినియోగదారులకు ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పార్టీ అధికార ప్రతినిధి అజయ్‌ మకెన్‌ మాట్లాడుతూ.. 2014 మేలో యూపీఏ పాలనాపగ్గాలు వదిలే సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌ 108 అమెరికన్‌ డాలర్లు ఉండేదని.. పెట్రోలు రూ.71.51, డీజిలు రూ.57.28 ధరలకు తాము అందించామన్నారు. ఇపుడు ముడి చమురు ధర సగానికి తగ్గినా, పెట్రో ధరలు ఆకాశాన్ని అంటుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు. 2014లో భాజపా అధికారం చేపట్టేనాటికి ఎక్సైజ్‌ సుంకం పెట్రోలుపై రూ.9.20, డీజిలుపై రూ.3.46 ఉండేదన్నారు. ఆరేళ్లలో ఈ సుంకాన్ని పెట్రోలుపై రూ.23.78, డీజిలుపై రూ.28.37 మేర అదనంగా పెంచారన్నారు. గత ఆరున్నర ఏళ్లలో కేవలం పెట్రోలు, డీజిలుపై పెంచిన ఎక్సైజ్‌ సుంకం ద్వారానే కేంద్రం రూ.20 లక్షల కోట్లు సంపాదించిందని మకెన్‌ తెలిపారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళుతోందని ఆయన ప్రశ్నించారు. సర్కారుకు ఆశ్రిత పెట్టుబడిదారులుగా ఉన్న వ్యక్తుల జేబుల్లోకి వెళుతోందా అని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోందన్నారు.

ప్రజల మన్‌ కీ బాత్‌  వినేందుకు వచ్చా
ఈటీవీ భారత్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆదివారం ఉదయం ఈరోడ్‌ జిల్లాలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంపై రాహుల్‌ పరోక్ష విమర్శలు చేశారు. పెరుందరయ్‌ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ.. ‘నా మనసులోని మాటలు మీకు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. మీ సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించడంలో సహాయపడటానికి వచ్చాను’ అంటూ ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’పై పరోక్ష విమర్శలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాహుల్‌గాంధీ మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం కోయంబత్తూర్‌లో పర్యటించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు