close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘పల్లా’ విజయం ఖాయం 

మంత్రులు ఎర్రబెల్లి, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌

ఈనాడు, నల్గొండ: ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని అపఖ్యాతి చేయాలనే ఉద్దేశంతో పదేపదే అబద్ధాలు చెబుతున్నాయని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించి ఆ ఆరోపణలను తిప్పికొట్టాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ అన్నారు. తెలంగాణ వచ్చిన ఆరేళ్లలో 1.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టంచేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భాజపా రెండువేల ఉద్యోగాలనూ కల్పించలేకపోయిందని మండిపడ్డారు. నల్గొండ - వరంగల్‌ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం నల్గొండలో నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు పట్టణంలో తెరాస శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.
కోడ్‌ వల్ల మరిన్ని కొలువులు ఇవ్వలేకపోయాం
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి కేసీఆర్‌ శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఎన్నికల కోడ్‌ వల్ల మరిన్ని ఉద్యోగాలు ఇవ్వలేకపోయామని, నిరుద్యోగులు అర్థం చేసుకొని తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌ వల్లే గిరిజనులు ఇప్పుడు రాజ్యాధికారంలో భాగమయ్యారన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమాల వారసత్వం తెరాసదేనని, ప్రశ్నించేవారు అలాగే మిగిలిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పల్లాపై కేసు నమోదు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) సభ్యుడు, ఆర్‌ఐ జీవీఎస్‌ రమణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నల్గొండ టూటౌన్‌ ఎస్సై నర్సింహులు తెలిపారు. నామినేషన్‌ సందర్భంగా నిబంధనలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడంపై ఆయన ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు