close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పార్లమెంటును కేసీఆర్‌ తప్పుదోవ పట్టించారు

త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతా: బండి సంజయ్‌
కమలం గూటికి చేరిన కపిలవాయి దిలీప్‌కుమార్‌

శ్రీనగర్‌ కాలనీ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటును తప్పుదోవ పట్టించారని, ఘోర తప్పిదం చేశారని.. త్వరలోనే అన్ని విషయాలు బయటపెడతానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. లోక్‌సభ స్పీకర్‌ అనుమతి కోరానని, స్పీకర్‌ నుంచి అనుమతి వస్తే కేసీఆర్‌ బండారం బయటపెడతానన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేత కపిలవాయి దిలీప్‌కుమార్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యాలయంలో భాజపాలో చేరిన సందర్భంగానూ, విలేకరుల సమావేశంలోనూ బండి సంజయ్‌ మాట్లాడారు. తెలంగాణలో దోపిడీ ఆగాలని, కుటుంబ పాలన అంతమొందాలని, గడీల పాలనకు, నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలనే ఆలోచనలతోనే దిలీప్‌కుమార్‌ తన నామినేషన్‌ని ఉపసంహరించుకుని భాజపాలో చేరారన్నారు. తెరాస వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి రావాలన్నారు. తెరాస వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ తన రాజకీయ స్వార్థానికే పీవీ పేరును వాడుకుంటున్నారని.. ఇందులో భాగంగానే వాణీదేవీకి ఎమ్మెల్సీ టికెట్‌ కేటాయించారని ఆయన విమర్శించారు. 2014లో పీవీ జయంతి సందర్భంగా తెలంగాణలోని ఒక జిల్లాకు, సాగునీటి పారుదల ప్రాజెక్టులకు ఆయన పేరు పెడతామని, హైదరాబాద్‌లో విగ్రహం పెడతానన్న ముఖ్యమంత్రి ఒక్కటీ చేయలేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ పీవీ ఘాట్‌ను కూల్చివేస్తామని చెప్పినా ఖండించలేదన్నారు. గెలిచే సీటులో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు.. ఓడిపోయే సీటులో మాత్రం పీవీ కుటుంబ సభ్యులు పోటీచేయాలా అని సంజయ్‌ ప్రశ్నించారు. దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపాయే అని, తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడటం బండి సంజయ్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌ కుల పంచాయితీ పెట్టారని, తెరాసకు మద్దతిస్తే పట్టభద్రులంతా తమను తాము మోసం చేసుకున్నట్లేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, ప్రొఫెసర్‌ విద్యాసాగర్‌, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌, ఎన్‌.వి.సుభాష్‌, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న కేటీఆర్‌: అరుణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లను ఓట్లడిగే అర్హత తెరాసకు లేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెరాస ప్రభుత్వం ఏడేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలు 32 వేలు మాత్రమేనని, మంత్రి కేటీఆర్‌ మాత్రం 1.32 లక్షల ఉద్యోగాలంటూ అబద్ధాలతో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై ఉస్మానియా వర్సిటీలో చర్చకు భాజపా సిద్ధంగా ఉందని, మంత్రి చెప్పినవి పచ్చి అబద్ధాలుగా నిరూపిస్తామని సవాలు విసిరారు. శుక్రవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆమె శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు