close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఎన్నికలు అత్యంత కీలకం

కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు
భాజపాకి ఓట్లడిగే నైతిక హక్కులేదు
ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. పార్టీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు సానుకూలత ఉందని, ప్రత్యర్థులు సైతం వారిని అభినందిస్తున్నారన్నారు. తెరాసదే విజయమని ఓటరుగా నమోదు చేయించుకున్న ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతు సమీకరించాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు.హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహాలపై శనివారం ఆయన తెలంగాణభవన్‌లో సమావేశం నిర్వహించారు.

అబద్ధాలు చెబుతున్న రాంచందర్‌రావు
కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు అన్ని విధాలా అన్యాయం చేసిన భాజపాకి ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఆ పార్టీ వాట్సప్‌ ద్వారా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు న్యాయవాదిగా ఉండి అబద్ధాలు చెబుతున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కేంద్రం పెంచిన గ్యాస్‌, డీజిల్‌, పెట్రోలు ధరలను ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలన్నారు. కాంగ్రెస్‌ది చరిత్రే తప్ప దానికి ఏ మాత్రం భవిష్యత్తు లేదన్నారు. సానుకూలతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని శ్రేణులకు సూచించారు. ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల అసత్యాలను, దుష్పచ్రారాన్ని బలంగా తిప్పికొట్టాలన్నారు.

వాణీదేవికి విస్తృత ఆదరణ
పార్టీ అభ్యర్థిని వాణీదేవి పీవీ కుమార్తె మాత్రమే కాదు విద్యావేత్త కూడా. విస్తృత స్థాయిలో నిస్వార్థంగా సేవలందించారు. ఆమెకు పట్టభద్రులతో పాటు అన్నివర్గాల నుంచి పెద్దఎత్తున ఆదరణ లభిస్తోంది.

ఉద్యోగులు వ్యతిరేకం అన్నది దుష్ప్రచారం
ప్రభుత్వ ఉద్యోగులు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకం అన్నది దుష్ప్రచారం మాత్రమే. వారితో తెరాసది పేగుబంధం. ఇటీవలే 24 వేల మందికి పదోన్నతులు లభించాయి. వారికి ఖచ్చితంగా వేతన సవరణ ఉంటుంది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

రాని వారిని ఎవరూ బతిమిలాడరు..
సమావేశానికి కొంత మంది స్థానిక నేతలు, మాజీలు గైర్హాజరు కావడంపై కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరెవరు సమావేశానికి రాలేదో సమాచారం ఉందన్నారు. రాని వారిని ఎవరూ బతిమిలాడరని అన్నారు. అవసరమైతే అక్కడ కొత్తవారికి అవకాశాలిస్తామన్నారు.
ఓటర్ల జాబితా, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల జాబితా, లాయర్లు, వివిధ వర్గాలకు చేపట్టిన కార్యక్రమాలకు సంబందించిన ప్రచార సామగ్రిని మంత్రి పంపిణీ చేశారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌అలీ, తలసాని, గంగుల, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని వాణీదేవి, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటరు ఇందులో పాల్గొన్నారు.

నేటి నుంచి ప్రచారం
పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. హైదరాబాద్‌ కృష్ణకాంత్‌ పార్క్‌లో ఉదయం  7 గంటలకు ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి వాకర్లను కలుస్తారు.  11 గంటలకు చేవెళ్లలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత వికారాబాద్‌లో జరిగే సమావేశానికి హాజరవుతారు.  ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి అల్కాపురి కమ్యూనిటీ హాలులో జరిగే  పట్టభద్రుల సమావేశంలో పాల్గొంటారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు