close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాసలీలల ఆరోపణలతో... కర్ణాటక మంత్రి రమేశ్‌ రాజీనామా

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: రాసలీలల ఆరోపణల్లో చిక్కిన కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లైంగి వాంఛ తీర్చుకున్నట్లు సహచట్టం కార్యకర్త ఒకరు బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై వస్తున్న ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ రమేశ్‌ జార్ఖిహొళి రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి యడియూరప్పకు పంపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అరుణ్‌సింగ్‌ ఈ వ్యవహారంపై యడియూరప్పతో చర్చించి రాజీనామాకు సూచించినట్లు సమాచారం.  
నిన్నటి వరకూ పెద్దదిక్కు....
రమేశ్‌ జార్ఖిహొళి ఏడాదిన్నర కింద అధికార పగ్గాలు చేపట్టిన భాజపాకు వెన్నుదన్నుగా నిలిచిన నేత. కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతగా, అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2018లో కాంగ్రెస్‌-జనతాదళ్‌ సంకీర్ణ ప్రభుత్వ పతనానికి పథక రచయిత. ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్‌, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేసి సంకీర్ణ ప్రభుత్వం పతనానికి నాంది పలికారు. దాదాపు ఏడు నెలలపాటు కాంగ్రెస్‌-జేడీఎస్‌ అసమ్మతి శిబిరానికి రమేశ్‌ నేతృత్వం వహించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో ఉన్న వైరంతో అప్పటి కాంగ్రెస్‌ అధికారాన్ని కూలుస్తానని సవాలు కూడా విసిరి అనుకున్నది సాధించారు. ప్రస్తుత భాజపా సర్కారులో దాదాపు 15 మందికి మంత్రి పదవులు ఇప్పించడంలోనూ రమేశ్‌ పాత్ర కీలకం. ప్రస్తుతం ఆయన రాజీనామా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘మా అన్నతో రాజీనామా చేయిస్తే... నీ సీడీలను బయటపెడతాం’ అంటూ ముఖ్యమంత్రి యడియూరప్పను రమేశ్‌ జార్ఖిహొళి సోదరులు బెదిరిస్తున్నారని కర్ణాటక విపక్ష నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ... రమేశ్‌కు మద్దతుగా నిలిచిన భాజపా నేతలకు నైతికత లేదన్నారు.  

రమేశ్‌ వ్యాఖ్యలతో దుమారం
ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అత్యంత అవినీతి పరుడుని రాజీనామా చేసిన మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న సీడీలో.. యువతితో సంభాషిస్తూ ‘మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంతో నిజాయితీ పరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి యడియూరప్ప అవినీతిపరుడు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాసలీల సీడీనే కాదు.. అందులో ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణల అంశాన్నీ విచారణ పరిధిలో చేర్చాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ డిమాండు చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు