close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పీవీ గౌరవాన్ని పునఃప్రతిష్ఠిద్దాం

ఆయన ప్రజాసేవ వారసత్వం కొనసాగించడానికే ఎమ్మెల్సీ బరిలో వాణీదేవి
మంత్రి కేటీఆర్‌

కవాడిగూడ, న్యూస్‌టుడే: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గౌరవాన్ని తెలంగాణలో పునఃప్రతిష్ఠించేందుకు హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి తెరాస నుంచి పోటీ చేస్తున్న సురభి వాణీదేవిని గెలిపించాలని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు పట్టభద్రులను కోరారు. పీవీ ప్రజాసేవ వారసత్వం కొనసాగించడానికి ఆయన కుమార్తె వాణీదేవి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. ఆదివారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ దిగువనున్న పింగళి వెంకట్రామిరెడ్డి హాలులో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో పీవీ వాణి పేరిట బ్రాహ్మణ సమన్వయ సమ్మేళనం జరిగింది. సంఘాల వారు వాణీదేవికి మద్దతు ప్రకటించారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ వేదాలు, సంస్కృతం, ఆయుర్వేదం, ప్రాచీన శాస్త్రాలను బ్రాహ్మణులే కాపాడుతూ వచ్చారని అన్నారు.  రూ.100 కోట్లతో బ్రాహ్మణ పరిషత్‌ ఏర్పాటు చేశామని.. 320 మంది బ్రాహ్మణ యువతకు విదేశీ విద్య అవకాశాలు కల్పించామని, 2,390 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలకు గ్రాంట్లు మంజూరు చేశామని వివరించారు. గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సదన్‌ పూర్తయిందని త్వరలో ప్రారంభోత్సవం చేసుకుందామన్నారు.  సభకు బ్రాహ్మణ పరిషత్‌ ఛైర్మన్‌ రమణాచారి అధ్యక్షత వహించగా కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, బివరేజెస్‌ మాజీ ఛైర్మన్‌ దేవీ ప్రసాద్‌, బ్రాహ్మణ సంఘం నాయకుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధికి తోడ్పడుతున్న తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: దేశాభివృద్ధికి తెలంగాణ ప్రజలు తోడ్పడుతున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కేటీ రామారావు ఆదివారం ట్విటర్‌లో పేర్కొన్నారు. క్రికెట్‌ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండు జట్టుపై విజయం సాధించిన భారత జట్టుకు  అభినందనలు తెలిపారు.

తెరాసకు టీయూటీఎఫ్‌ మద్దతు

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీయూటీఎఫ్‌) మద్దతు తెలిపింది.  సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు కైలాసం, నూతనకంటి బాబులు ఆదివారం మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

టాక్సీ డ్రైవర్ల సంఘం కూడా..

తెరాస కార్మిక విభాగానికి చెందిన టాక్సీ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు నగేశ్‌, ఇతర నేతలు సంపత్‌, రాజుయాదవ్‌ తదితర ప్రతినిధులు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. పార్టీ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డిని కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు.

మేం మొదలుపెడితే తట్టుకోలేరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాకపోతే భాజపా, కాంగ్రెస్‌ నేతలకు ఆస్థిత్వమే లేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. ఎగిరెగిరి పడుతున్న భాజపా ఎంపీలు ఏరోజూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. ‘‘కేసీఆర్‌ను దూషించడానికి భాజపా నేతలకు ఎన్నిగుండెలు? మేం కూడా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా వంటి వారి మీదా మాట్లాడగలం. మేం మొదలుపెడితే తట్టుకోలేరు. ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ సహా మా నేతలకు కేసీఆర్‌ శిక్షణ ఉంది’’ అని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్లు ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఇటీవల పలువురు పాత్రికేయులు చనిపోగా బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు