close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆట మొదలైంది.. నినాదం అదిరింది!

బెంగాల్‌లో హోరాహోరీగా ప్రచారం

ఖేలా హోబె.. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌ను ఊపేస్తున్న నినాదమిది. పార్టీలకతీతంగా నేతల నోటి నుంచీ ఆ మాటే వినిపిస్తోంది. బహిరంగ సభల్లో, ర్యాలీల్లో మార్మోగుతోంది. ఇంతకీ ఆ నినాదం అర్థం ఏంటో తెలుసా.. ‘ఆట మొదలైంది’ అని. రాష్ట్రంలో అధికార పీఠం కోసం రాజకీయ యుద్ధం మొదలైందని అది సూచిస్తోంది! ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ ప్రజలను ఆకర్షించేందుకు నేతలు తూటాల్లాంటి మాటలు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రముఖంగా వినిపిస్తున్న నినాదాలేంటో ఓసారి పరిశీలిద్దాం.

సవాలుకు భాజపా సై
బంగ్లాదేశ్‌ నుంచి అరువు తెచ్చుకున్న నినాదమంటూ ‘ఖేలా హోబె’పై తొలినాళ్లలో భాజపా విమర్శలు గుప్పించింది. రాజకీయాలను యుద్ధరంగంగా మార్చేందుకు తృణమూల్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. తర్వాత క్రమంగా కమలనాథులూ దాన్ని వినియోగించడం ప్రారంభించారు. తృణమూల్‌ సవాలును తాము స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ఆట మొదలైంది. మార్పు వస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. తృణమూల్‌ ఆట పూర్తయిందని పేర్కొన్నారు. గత నెల్లో హుగ్లీలో భాజపా నిర్వహించిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ రావడానికి ముందు అక్కడ వేచి ఉన్న కార్యకర్తలు ‘ఖేలా హోబె’ అంటూ చేసిన నినాదంతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. వామపక్షాలు, కాంగ్రెస్‌ నేతలు కూడా ‘ఆట మొదలైంది’ నినాదాన్ని ఉపయోగిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో పుట్టి..
తొలిసారిగా ‘ఖేలా హోబె’ను బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్‌ పార్టీ ఎంపీ షమీమ్‌ ఉస్మాన్‌ కొన్నేళ్ల క్రితం ఉపయోగించారు. అది ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది మాత్రం పశ్చిమ బెంగాల్‌లోనే. తృణమూల్‌ కాంగ్రెస్‌ బీర్‌భూమ్‌ జిల్లా అధ్యక్షుడు అనుబ్రతా మొండల్‌ స్థానికంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘ఆట మొదలైంది. ఇది ప్రమాదకర ఆట’’ అని పేర్కొన్నారు. నాటి నుంచి తృణమూల్‌ నేతలు ప్రతిరోజు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆ నినాదాన్ని హోరెత్తిస్తున్నారు. భాజపాకు సవాలు విసురుతున్నారు.
పాటగానూ మార్చి..
‘ఆట మొదలైంది’ నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లడంతో తృణమూల్‌ మరో అడుగు ముందుకేసింది. దాన్ని పాటగా మార్చింది. త్వరలో జరగనున్న ఎన్నికలను స్థానికులు, బయటి శక్తుల మధ్య పోరుగా అందులో అభివర్ణించింది. ‘‘బయటివాళ్లు నెలకోసారి రాష్ట్రంలో పర్యటిస్తారు. కానీ, నీవు-నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాం స్నేహితుడా. ఆట మొదలైంది’’ అంటూ ఆ గీతం సాగుతుంది. తృణమూల్‌ నేతలకు గాలమేస్తోందంటూ భాజపాపై విమర్శలూ అందులో ఉన్నాయి.

దీదీ లోకల్‌ అంటూ..
భాజపాను బెంగాల్‌ వెలుపలి శక్తిగా తృణమూల్‌ పేర్కొంటోంది. అందుకే ‘బెంగాల్‌కు తమ సొంత బిడ్డే కావాలి’ అన్న నినాదాన్ని దీదీ తెరపైకి తెచ్చారు. తమ పార్టీకే మరోసారి విజయాన్ని కట్టబెట్టాలని పిలుపునిస్తున్నారు.
* కమలనాథులు నినాదాలను బాగానే ఉపయోగించుకుంటున్నారు. 19వ శతాబ్దంలో కమ్యూనిస్టు ఇటలీలో బాగా ప్రాచుర్యం పొందిన ‘బెల్లా సియావో’ అనే ట్యూన్‌తో వారు ‘పిషి జావో, పిషి జావో’ అనే నినాదమిచ్చారు. మమత బెంగాల్‌ను వీడి వెళ్లాలని దానర్థం.
* ‘రెండు ఇంజిన్ల సర్కారు’ అనే నినాదాన్నీ భాజపా ఇటీవల తెరపైకి తెచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి వేగంగా సాగుతుందని వివరించింది. ‘జై శ్రీరామ్‌’నూ ఆ పార్టీ బాగానే ప్రచారం చేస్తోంది.
* కమలదళం ఇచ్చిన ‘రెండు ఇంజిన్ల సర్కారు’ నినాదానికి తృణమూల్‌ ఎంపీ, దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మమతా బెనర్జీకి చెందిన ఒక్క ఇంజిన్‌ను ఓడించడానికి భాజపా 500 ఇంజిన్లను రాష్ట్రంలో మోహరించింది’’ అని ఎద్దేవా చేశారు.
* మమతా బెనర్జీ కూడా ‘ఖేలా హోబె’ నినాదాన్ని ఉపయోగించారు. ‘‘ఆట మొదలైంది. నేనే గోల్‌కీపర్‌ను. ఎవరు గెలుస్తారో చూద్దాం’’ అని ఓ కార్యక్రమంలో ఆమె వ్యాఖ్యానించారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు