close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
దేశంలో రాజకీయ అస్థిరతకు కుట్ర

సాగు చట్టాలపై, సీఏఏపై దుష్ప్రచారం అందుకే
రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగం మార్పు అపోహలు
41వ వ్యవస్థాపన దినోత్సవంలో భాజపా శ్రేణులతో మోదీ

దిల్లీ: దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు భారీ కుట్ర జరుగుతోందని... ఇందులో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలపైనా, సీఏఏ, కార్మిక చట్టాలపైనా కొందరు దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఆయా చట్టాల గురించి నిజానిజాలేమిటో ప్రజలకు వివరించాలని భాజపా శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భాజపా 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన వీడియో ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రైతుల భూములను సర్కారు స్వాధీనం చేసుకుంటుందని, కొందరి పౌరసత్వాలను రద్దు చేస్తుందని, రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాలు, సీఏఏ, కార్మిక చట్టాల విషయంలో వారు ఇలాగే వ్యవహరించారు. దుర్బుద్ధితో అపోహలను, ఊహాజనిత భయాలను సృష్టిస్తున్నారు. ఓటమిని అంగీకరించలేనివారు, దురుద్దేశపూరిత రాజకీయాలు చేసేవారు, భాజపాకు వ్యతిరేకంగా విద్వేషవ్యాధి ఉన్నవారే ఈ చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రజల వద్దకు వెళ్లండి’’ అని పార్టీ శ్రేణులకు ప్రధాని ఉద్బోధించారు.

మేం గెలిస్తే ఈవీఎం.. వారైతే ప్రశంసలు

భాజపాను ‘ఎన్నికలు గెలిచే యంత్రం (ఎలక్షన్‌ విన్నింగ్‌ మిషీన్‌-ఈవీఎం)’గా విపక్షాలు విమర్శించడంపై మోదీ మండిపడ్డారు. ‘‘విపక్షాలు ద్వంద్వ వైఖరిని కనబరుస్తున్నాయి. వారి అభ్యర్థులు గెలిస్తే ప్రశంసిస్తారు. అదే భాజపా నేతలు గెలిస్తే ఆరోపణలు చేస్తారు. దేశ ప్రజాస్వామ్య పరిపక్వత వారికి అర్థం కావడం లేదు. ప్రజల హృదయాలను భాజపా గెలుచుకుంటూనే ఉంటుంది. దేశంలోని పేదలకు, గ్రామీణులకు తొలిసారిగా ‘అంత్యోదయ’ పథకాలు చేరువ కావడంతో వారు భాజపాను హత్తుకుంటున్నారు. మధ్యతరగతి వారూ మాకు ఎంతో దగ్గరయ్యారు. ఇప్పుడు నగరాలతో పాటు పల్లెల్లోనూ మేము బలంగా ఉన్నాం’’ అని అన్నారు.

మేలు చేసేవారిపై ‘మతతత్వ’ ముద్ర

భాజపా... జాతీయ, ప్రాంతీయ ఆకాంక్షలకు అద్దం పట్టే పార్టీ. లౌకికతత్వం (సెక్యులర్‌) ముసుగులో వారసత్వ రాజకీయాలు చేస్తున్న పార్టీలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. వారి లౌకికతత్వం కొద్దిమంది ప్రయోజనాల కోసమే. సమాజంలోని అందరి మేలు కోసం పనిచేసేవారిపై మాత్రం వారు ‘మతతత్వ’ ముద్ర వేస్తున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు