
ప్రధానాంశాలు
తెరాస శాసనసభాపక్షంలో తెదేపా పక్షం విలీనం
లేఖ ఇచ్చిన ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలోని తెలుగుదేశం పక్షం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షంలో విలీనమయింది. ఆ మేరకు తెదేపా శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వరరావు (అశ్వారావుపేట)లు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో కలిసి తమ పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన నివాసంలో కలిసి లేఖ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పలువురు తెరాస శాసనసభ్యులు పాల్గొన్నారు. తెదేపా సభ్యుల లేఖకు సభాపతి పోచారం ఆమోదం తెలిపారు.ఆమేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు అధికారిక బులెటిన్ విడుదల చేశారు.తెదేపా సభ్యులు ఇద్దరు విలీనం కావడంతో శాసనసభలో తెరాస బలం మరింత పెరిగింది. మరోవైపు తెదేపా ప్రాతినిధ్యం కోల్పోయింది. శాసనమండలిలో చాలాకాలంగా తెదేపాకు ప్రాతినిధ్యం లేదు. తాజా పరిణామంతో అసెంబ్లీలో కూడా కనుమరుగైంది. ప్రస్తుతం శాసనసభలో నామినేటెడ్ సభ్యునితో కలిపి 119 మంది సభ్యులుండగా వారిలో 104 మంది తెరాసకు చెందిన వారు. మజ్లిస్‌కు 7, కాంగ్రెస్‌కు 6, భాజపాకు ఇద్దరు సభ్యుల చొప్పున ఉన్నారు. నాగార్జునసాగర్ స్థానం ఖాళీగా ఉంది.
విలీనం ఇలా..
2014 శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తెదేపా శాసనసభ్యులు 12 మంది మొదటి దఫాగా 2016లో తెరాస శాసనసభాపక్షంలో విలీనమయ్యారు. ఆ తర్వాత 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెదేపా నుంచి ఇద్దరు గెలిచారు. వారిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెరాసలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో మెచ్చా నాగేశ్వర్రావు తెరాసలో చేరేందుకు ముందుకు రాలేదు. నిబంధనల మేరకు ఒక పార్టీలో మూడొంతుల మంది అంగీకరిస్తేనే మరో పార్టీలోకి విలీనానికి వీలుంటుంది. తెదేపాకు ఇద్దరు సభ్యుల్లో ఒకరు చేరితే 50 శాతం కిందికే వస్తుంది. ఈ కారణం వల్ల విలీనానికి వీలు కాలేదు. దీంతో తెరాసలో అధికారికంగా చేరకపోయినా సండ్ర ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.తాజాగా నాగేశ్వరరావు సైతం తెరాసలో చేరేందుకు ముందుకురావడంతో వారిద్దరూ బుధవారం పోచారంను కలిసి తెరాసలో విలీన లేఖ రాశారు. ఆ వెంటనే ప్రక్రియ పూర్తయింది.
సీఎం అభినందనలు
తెరాస శాసనసభా పక్షంలో విలీనం అనంతరం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారిని ఆయన అభినందించారు. తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారికి అభినందనలు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే: ఎమ్మెల్యేలు సండ్ర, మెచ్చా
రాష్ట్రం, ఖమ్మం జిల్లా, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము తెరాసలో విలీనమయ్యామని ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెదేపా లేదని అన్నారు.
బులెటిన్‌లో ఇలా...
* భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4వ పేరా కింద తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షంతో విలీనం కావాలని తీర్మానించుకున్నామని, దీనికి ఆమోదం తెలపాలని ఇద్దరు తెదేపా సభ్యులు సభాపతిని అభ్యర్థించారని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు తెలిపారు. దీనిని అంగీకరిస్తూ తెరాస పార్టీ శాసనసభాపక్ష నేత సభాపతికి లేఖ పంపారని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా విలీనానికి సభాపతి ఆమోదం తెలిపారన్నారు. విలీనం దృష్ట్యా తెరాస శాసనసభా పక్షసభ్యులతో పాటు సండ్ర, మెచ్చాలకు స్థానాలుకేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- RIP Vivek: హృదయం ముక్కలైంది..!
- కవచాన్నికరగనీయొద్దు