close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
టీకాల ఎగుమతులతోనే కొరత

కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్న కేంద్రం
కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో సోనియా సమీక్ష

దిల్లీ: కొవిడ్‌ పరిస్థితిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోతోందని.. వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ దేశంలో కొరతను సృష్టిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల బహిరంగ సభలు, జన సమీకరణల వంటివి రద్దు చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, పార్టీ భాగస్వామ్యంతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కాంగ్రెస్‌ మంత్రులతోనూ ఆమె ఆన్‌లైన్‌ విధానంలో శనివారం సమావేశమ్యారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా రెండో ఉద్ధృతిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సమస్యలను ఎత్తిచూపడం, కేంద్ర ప్రభుత్వం ‘ప్రచార ఎత్తుగడల’కు దూరంగా.. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా.. పనిచేసేలా చూడటం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ బాధ్యత అని అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపైనే దృష్టి పెట్టాలని, ఆ తర్వాతే ఇతర దేశాలకు ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. రాష్ట్రాలతో సమన్వయం అనేది సమాఖ్య వ్యవస్థను గౌరవించడం అవుతుందన్నారు. అదే సమయంలో కొవిడ్‌పై పోరుకు రాష్ట్రాలు కూడా కేంద్రంతో నిర్మాణాత్మకంగా సహకరించాలని సూచించారు. ‘టెస్ట్‌, ట్రాక్‌, వ్యాక్సిన్‌’లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక, ఇతర పరిస్థితులు.. టీకాల లభ్యత.. తగినంతగా మందులు, వెంటిలేటర్లు, వైద్యవసతుల ఏర్పాటు తదితర అంశాలను సమీక్షించారు. సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ కొవిడ్‌ రెండో ఉద్ధృతికి కారణమవుతున్న కరోనా ఉత్పరివర్తనాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని కోరారు. ఉదాసీనతకు బదులు మన శక్తులను కూడగట్టి, చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు. పంజాబ్‌లో టీకా నిల్వలు మరో 5 రోజుల్లోను, ఛత్తీస్‌గఢ్‌లో మరో 3 రోజుల్లోనూ ఖాళీ అయిపోతాయని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అమరీందర్‌ సింగ్‌, భూపేశ్‌ బఘేల్‌ల తెలిపారు. కేంద్రం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వ్యతిరేక భావనతో చూడవద్దని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ సూచించారు.
* కరోనా నేపథ్యంలో సామాన్య ప్రజల చేతుల్లో డబ్బులు ఉంచాలని రాహుల్‌ గాంధీ సూచించారు. కేంద్రం అహంకార ధోరణితో మంచి సలహాలను స్వీకరించడం లేదని దుయ్యబట్టారు. ‘‘కేంద్ర ప్రభుత్వ విఫల విధానాలు భయానక రీతిలో కరోనా వైరస్‌ రెండో ఉద్ధృతికి దారితీశాయి. వలస కార్మికులు మరోసారి ఇంటిబాట పట్టేలా చేశాయి’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు