close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ హత్యాకాండ భాజపా కుట్రే!

ఓటర్లను భయపెట్టే చర్యల్లో భాగమే
కూచ్‌ బిహార్‌ ఘటనపై మమతా బెనర్జీ ఆరోపణ

రాజ్‌గంజ్‌/నగ్రకోట: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూచ్‌బిహార్‌ జిల్లా సితాల్‌కుచిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) జరిపిన కాల్పుల్లో నలుగురు ఓటర్లు మృతి చెందిన ఘటనను ఆమె భాజపా కుట్రగా అభివర్ణించారు. ఓటర్లను భయపెట్టి పోలింగ్‌ కేంద్రాల నుంచి వెళ్లిపోయేలా చేసే చర్యల్లో భాగంగానే మారణకాండకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చేందుకే సితాల్‌కుచిలోకి రాజకీయ నాయకులు ప్రవేశించకుండా 72 గంటలపాటు నిషేధాన్ని ఎన్నికల సంఘం విధించిందని ఆరోపించారు. మమతా బెనర్జీ ఆదివారం జల్పాయ్‌గుడి జిల్లాలో నిర్వహించిన మూడు ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ఆ తర్వాత సిలిగుడిలో విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. శనివారం నాటి కూచ్‌బిహార్‌ కాల్పుల ఘటనను సామూహిక హత్యాకాండగా అభివర్ణించారు. సీఐఎస్‌ఎఫ్‌ చర్యలను సమర్థిస్తూ భాజపా నాయకులు మాట్లాడడంపై ఆమె మండిపడ్డారు.‘మీ కుటుంబ సభ్యులెవరైనా మరణిస్తే ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారా’ అంటూ నిలదీశారు.
‘‘మనకో అసమర్థ హోంమంత్రి, అసమర్థ కేంద్ర ప్రభుత్వం ఉంది. పరిస్థితులను ఎలా చక్కదిద్దాలో సీఐఎస్‌ఎఫ్‌ బలగాలకు తెలియదు. కేంద్ర బలగాల్లోని కొంత మంది ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారనే విషయం మొదటి దశ పోలింగ్‌ నుంచి చెబుతూనే ఉన్నాను. నందిగ్రామ్‌లో ఈ విషయం చెప్పినప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు’’ అని మమత అన్నారు. విలేకరుల సమావేశం కొనసాగుతుండగానే... శనివారం కాల్పుల్లో మృతి చెందిన నలుగురు వ్యక్తుల కుటుంబ సభ్యులతో మమత ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 14న పరామర్శించేందుకు వస్తానని హామీ ఇచ్చారు.

‘మోదీ నియమావళి’గా మార్చండి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని.. ‘మోదీ ప్రవర్తనా నియమావళి’ గా మార్చాలంటూ మమత ట్వీట్‌ చేశారు. భాజపా ఎన్ని కుట్రలు చేసినా.. నా ప్రజల నుంచి నన్ను దూరం చేయలేరని పేర్కొన్నారు.

టీఎంసీ కార్యకర్తల రాష్ట్రవ్యాప్త ధర్నాలు
కూచ్‌ బిహార్‌లో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాల్పుల్లో నలుగురి మృతికి నిరసనగా టీఎంసీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఆదివారం ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామాకు డిమాండ్‌ చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు