close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొనసాగుతున్న షర్మిల దీక్ష

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ వైఎస్‌ షర్మిల చేపట్టిన ‘ఉద్యోగ దీక్ష’ రెండోరోజు శుక్రవారం లోటస్‌పాండ్‌లో కొనసాగింది. దీక్షా శిబిరానికి షర్మిల తల్లి విజయమ్మ వచ్చి పరామర్శించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు ముట్టనని, 72 గంటల దీక్షను కొనసాగిస్తానని షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని నిరుద్యోగులను కోరారు. గురువారం సాయంత్రం ఇందిరాపార్క్‌ వద్ద దీక్షను భగ్నం చేసి లోటస్‌పాండ్‌కు తరలిస్తున్న క్రమంలో షర్మిల ఎడమ చేతికి గాయం కాగా వైద్యులు పరీక్షించి పట్టీ వేశారు. ఆమె చక్కెర స్థాయిని, రక్తపోటునూ పరీక్షించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె చేతికి నల్ల రిబ్బను కట్టుకున్నారు. లోటస్‌పాండ్‌ వద్దకు నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కళాకారులతో కళాజాత ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. షర్మిల కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న వైకాపా ముఖ్యనేత కొండా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఏసీపీ శ్రీధర్‌పై  చర్యలు తీసుకోవాలి
పాదయాత్రగా వెళ్తున్న తమ నాయకురాలితో అనుచితంగా, దురుసుగా ప్రవర్తించిన ఏసీపీ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ షర్మిల అనుచరులు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. ఆయన షర్మిల మెడపై చెయివేసి పోలీసు వాహనం వైపు లాక్కెళ్లారని ఫిర్యాదుచేశారు. ఈ క్రమంలో ఆమె దుస్తులు చిరిగాయని పేర్కొన్నారు. ఇదే ఫిర్యాదును గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర పోలీసు అధికారులకూ పంపారు.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు