close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లింగోజిగూడ డివిజన్‌లో పోటీకి తెరాస దూరం

భాజపా నేతల విజ్ఞప్తి మేరకు నిర్ణయం
  ఏకగ్రీవానికి సహకరిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడి
  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు ఫోన్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండాలని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఏకగ్రీవ ఎన్నిక కోసం తమకు మద్దతు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. లింగోజిగూడ నుంచి ఎన్నికైన భాజపా కార్పొరేటర్‌ ఆకుల రమేశ్‌గౌడ్‌ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మృతి చెందారు. ఈ డివిజన్‌కు ఈ నెల 30న ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో భాజపా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, జాతీయ కార్యవర్గసభ్యుడు పేరాల శేఖర్‌రావు, రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి నేతృత్వంలో కొందరు పార్టీ కార్పొరేటర్లు శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. సమావేశంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఆకుల రమేశ్‌గౌడ్‌ కుమారుడు అఖిల్‌గౌడ్‌, సతీమణి ఇతర నేతలు పాల్గొన్నారు. భాజపా వినతిని కేటీఆర్‌.. పార్టీ అధ్యక్షుడైన సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే రమేశ్‌గౌడ్‌ మరణించడం దురదృష్టకరం. ఆయన అకాల మరణం వల్ల వచ్చిన ఈ ఎన్నికలో పోటీ పెట్టవద్దనే భాజపా వినతిని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సూచన మేరకు పోటీ చేయవద్దనే నిర్ణయం తీసుకున్నాం’’ అని తెలిపారు.
కాంగ్రెస్‌ కూడా కలిసి రావాలి...
అనంతరం కేటీఆర్‌ అక్కడి నుంచే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ఎన్నికలో అభ్యర్థిని పోటీకి నిలపకుండా ఏకగ్రీవ ఎన్నికకు కలిసి రావాలని కోరారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఫోన్‌ ద్వారా, కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని నేరుగా కలిసి ఏకగ్రీవానికి సహకరించాలని కోరామని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు తెలిపారు. తెరాస ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఈ ఎన్నిక విషయంలో సహకరిస్తామని చెప్పడంతో కేటీఆర్‌ను కలిశామని వివరించారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇచ్చారన్నారు. మానవతా దృక్పథంతో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని భాజపా ప్రతినిధి బృందం, రమేశ్‌గౌడ్‌ కుటుంబ సభ్యులు కేసీఆర్‌, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
బండి సంజయ్‌ ఆగ్రహం
లింగోజిగూడ ఉపఎన్నిక విషయంలో భాజపా నగర నేతలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలవకుండా మంత్రి కేటీఆర్‌ను ఎందుకు కలిశారని ఆయన రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డిని ఫోన్‌లో నిలదీశారు. ‘‘కచ్చితంగా గెలిచే స్థానం. ఎన్నికల్లో పోరాడి గెలవాలి. ఏకగ్రీవం కోసం ఎందుకు ప్రయత్నించారు..ఎలా వెళ్లారు? ఇది పద్ధతి కాదు. మరోసారి రాష్ట్ర పార్టీకి చెప్పకుండా ఇలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు’’ అని హెచ్చరించారు. మరో సీనియర్‌ నేతను వివరణ కోరినట్టు సమాచారం.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు