close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అభివృద్ధిలో పోటీపడండి

భాజపాకు మంత్రి కేటీఆర్‌ సూచన
సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల; ఇల్లంతకుంట, గంభీరావుపేట- న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి అదనపు నిధులు రప్పించాల్సింది పోయి.. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ రెచ్చగొట్టే మాటలతో కాలం గడుపుతున్నారని మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంటలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా... జాతీయ రహదారి... కనీసం నవోదయ పాఠశాలనైనా తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పోటీ పడాలని సవాల్‌ విసిరారు. భాజపా దుబ్బాకలో ఒక చోట గెలిచి.. వాపును చూసి బలుపు అనుకుంటోందని ఆక్షేపించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస గెలుపే వారికి సమాధానమన్నారు. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లోనూ తెరాస గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెరాస ఎప్పుడైనా కీలెరిగి వాత పెడుతుందని చెప్పారు.
ఎగువమానేరులో పూజలు
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలో గోదావరి నీటికి మంత్రి కేటీఆర్‌ పూజలు చేశారు. హారతి ఇచ్చి మానేరు జలాశయంలో పూలు జల్లారు. మండు వేసవిలోనూ మానేరు జలకళను సంతరించుకోవటం అద్భుతమని వ్యాఖ్యానించారు.
మంత్రి పర్యటనలో విపక్షాల నిరసనలు
ఇల్లంతకుంటలో మంత్రి కేటీఆర్‌ పర్యటన విపక్షాల నిరసనల మధ్య కొనసాగింది. ఏబీవీపీ, కాంగ్రెస్‌ నాయకులు మంత్రి వాహనశ్రేణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు భాజపా నాయకులు సెల్‌టవర్‌ ఎక్కి నిరసనకు దిగారు. పోలీసులు ఎక్కడి వారిని అక్కడే నిలువరించారు. ఆయా పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మంత్రి కేటీఆర్‌ వాహనశ్రేణిని అడ్డుకున్న విపక్ష నాయకులపై ఫిర్యాదు చేసేందుకు టీఆర్‌ఎస్వీ మండలశాఖ అధ్యక్షుడు ఎండ్ర చందన్‌ పలువురు నాయకులతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న భాజపా, ఏబీవీపీ నాయకులు టీఆర్‌ఎస్వీ నాయకులపై దాడికి దిగారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. దీనికి ప్రతిగా తెరాస నాయకులు భాజపా మండలశాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి వాహన అద్దాలను ధ్వంసం చేశారు. ఇరువర్గాల నాయకులకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు