close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నామినేషన్లలో పకడ్బందీ వ్యూహం

 సగానికి పైగా సిట్టింగులను మార్చిన తెరాస
 వరంగల్‌లో కొంత అసమ్మతి

ఈనాడు, హైదరాబాద్‌: మినీ పుర పోరు నామినేషన్ల పర్వంలోనే తెరాస పకడ్బందీ వ్యూహం అమలు చేసింది. వరంగల్‌ మహా నగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్‌ పురపాలక సంఘాలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ఖమ్మం మినహా ఇతర నగర, పురపాలికల్లో తెరాస ఒంటరిగా పోటీ చేస్తోంది. ఖమ్మంలో సీపీఐతో పొత్తు కుదుర్చుకుంది. గురువారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేసరికి వరంగల్‌లో కొంత అసమ్మతి బెడద ఉన్నా మిగిలినచోట్ల ఈ సమస్య లేకుండా జాగ్రత్త పడింది. ప్రస్తుత కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని సగం మందికి పైగా టికెట్లను నిరాకరించింది.
వరంగల్‌లో పోటాపోటీ
వరంగల్‌లో తెరాస 66 డివిజన్లలో పోటీ చేస్తోంది. ఇక్కడ పార్టీ టికెట్లకు పోటీ ఏర్పడింది. పెద్దఎత్తున నామినేషన్లు వేశారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీ బండా ప్రకాశ్‌లతో పార్టీ అధిష్ఠానం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ అందరితోనూ చర్చించి ఎక్కువ మందిని ఉపసంహరింపజేసింది. కొందరు ససేమిరా అన్నారు. తెరాస అభ్యర్థులు ఇతర పార్టీల వైపు చూడకుండా కమిటీ చివరిరోజు బీఫారాలు అందజేసింది. ఉపసంహరణ అనంతరం పదిచోట్ల అసమ్మతి సమస్య ఉంది. గత పాలకవర్గంలో తెరాసకు 53 మంది కార్పొరేటర్లు ఉండగా.. 24 మందికి మాత్రమే తిరిగి టికెట్లిచ్చింది.
ఖమ్మంలో 21 మందికే తిరిగి టికెట్లు
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 60 స్థానాలకు గాను 57 స్థానాల్లో తెరాస, మూడింట సీపీఐ బరిలో ఉన్నాయి. పదో డివిజన్‌లో మిగిలిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో తెరాస అభ్యర్థి ఏకగీవ్రం కానున్నారు. మిగిలిన 56 స్థానాలకు రెండు మూడు చోట్ల తిరుగుబాటుదారుల సమస్య ఉంది. గత పాలకవర్గంలో 43 మంది తెరాస కార్పొరేటర్లుండగా వారిలో 21 మందికి పార్టీ టికెట్లిచ్చింది. సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌లలో తిరుగుబాటుదారుల బెడదను నివారించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు