close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భాజపాకు తప్పని భంగపాటు

వరంగల్‌ మినహా ఎక్కడా ప్రభావం చూపని పార్టీ
లింగోజిగూడ సిట్టింగ్‌ స్థానంలోనూ ఓటమి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో భాజపా ప్రభావం చూపలేకపోయింది. ప్రత్యేకదృష్టి పెట్టి నేతలు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ నిరాశాజనక ఫలితాలే వచ్చాయి. వరంగల్‌ కార్పొరేషన్‌లో మాత్రమే కమలం కొంత బలాన్ని పెంచుకోగలిగింది. జీహెచ్‌ఎంసీ లింగోజిగూడ డివిజన్‌ సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ చేతిలో ఓటమి పాలవడం తమకు షాక్‌ ఇచ్చినట్లయిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పడ్డ కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీల్లో భాజపా ఖాతా తెరవలేదు. తమకు పట్టుందని భావించే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ ఆ పార్టీ సత్తా చాటలేకపోయింది. అచ్చంపేటలో ఒకటి, జడ్చర్లలో రెండు వార్డులను మాత్రమే గెలుచుకుంది. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలో రెండు స్థానాలను గెలుచుకోగా.. ప్రస్తుతం ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. ఖమ్మం కార్పొరేషన్‌లో జనసేనతో కలిసి బరిలోకి దిగినా అక్కడా ఒకే డివిజన్‌కు పరిమితమైంది. వరంగల్‌ కార్పొరేషన్‌లో గతంలో ఒక డివిజన్‌ ఉంటే.. ఈసారి 10 డివిజన్లను గెలుచుకుంది. ‘వరంగల్‌’ కైవసం లక్ష్యంగా వ్యూహరచన చేసినా.. బలాన్ని పెంచుకోవడానికే పరిమితమైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌ సర్కిల్‌లో మొత్తం 11 డివిజన్లలో క్లీన్‌స్వీప్‌ చేసిన భాజపా.. ఉప ఎన్నికలో లింగోజిగూడను నిలబెట్టుకోలేకపోయింది. ఇక్కడ భాజపా నుంచి గెలిచిన ఆకుల రమేష్‌గౌడ్‌ మరణంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ క్రమంలో ఎన్నికకు ముందు కొందరు భాజపా నేతలు కేటీఆర్‌ వద్దకు వెళ్లి తెరాస మద్దతు కోరగా.. ఆ పార్టీ అభ్యర్థిని నియమించలేదు. ఈ అంశం పార్టీలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని నిలపడంతో ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌పై గెలుపు సులభమని భాజపా భావించినా అనూహ్యంగా ఓటమిపాలైంది. రమేష్‌గౌడ్‌ కుమారుడు అఖిల్‌గౌడ్‌కు రాజకీయ అనుభవం లేకపోవడం.. రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు ఎవరూ ఇక్కడ ప్రచారానికి రాకపోవడం ఫలితంపై ప్రభావం చూపింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు