close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కాంగ్రెస్‌లో మళ్లీ అదే నిరాశ

ఒక్కచోట మాత్రమే రెండంకెల స్థానాలు

ఈనాడు, హైదరాబాద్‌: మినీ పురపోరులోనూ కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు తాజాగా జరిగిన రెండు నగరపాలక సంస్థలు, ఐదు పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు దక్కలేదు. నాగార్జునసాగర్‌ ఎన్నిక ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ను మినీ పురపాలక ఫలితాలు మరింత నిస్పృహలోకి నెట్టేశాయి. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీల్లో ఒక్క చోటా కాంగ్రెస్‌కు ఆశాజనక ఫలితం రాలేదు. ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు మినహా ఇతర స్థానాల్లో కాంగ్రెస్‌ రెండు, మూడు వార్డులకే పరిమితమైంది. సిద్దిపేటలో ఒక్క వార్డులోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోవడం గమనార్హం. ఎన్నికలు జరిగిన ఏడింటిలో ఖమ్మంలో మాత్రమే రెండంకెల స్థాయికి చేరగలిగింది.

శాసనసభ ఎన్నికల నుంచి జరుగుతున్న అన్ని వరుస ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో ఆ పార్టీ నాయకత్వం, శ్రేణుల్లో నిరాశ కమ్ముకుంటోంది. మినీ పురపాలక ఎన్నికల్లో అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచార బాధ్యతలను పూర్తిస్థాయిలో స్థానిక నాయకత్వానికి అప్పగించారు. పురపోరుకు తక్కువ సమయం ఉండటం, కొవిడ్‌ పరిస్థితుల ప్రతికూలత నేపథ్యంలో ఇబ్బంది పడినట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. స్థానిక నాయకత్వం సమర్థంగా వ్యవహరించిన చోట ఆశాజనకంగా ఫలితాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు. అచ్చంపేట, నకిరేకల్‌లో మాత్రమే అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసింది. ఖమ్మంలో సీపీఎంతో కలసి పోటీచేయడం కొంతమేర పార్టీకి కలసి వచ్చింది. కూటమి 12 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్‌కు 10 స్థానాలు, సీపీఎంకు రెండు దక్కాయి. వరంగల్‌లో కాంగ్రెస్‌ నాలుగు డివిజన్లకు పరిమితమయింది. జడ్చర్ల, నకిరేకల్‌లో రెండేసి వార్డులు మాత్రమే దక్కించుకుంది. అచ్చంపేటలో ఆరు వార్డులు, కొత్తూరులో ఐదు వార్డుల్లో గెలుపు ఆ పార్టీకి కొంత ఊరటను ఇచ్చింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు