close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొత్త కార్పొరేటర్లు, కౌన్సెలర్లపై సమాచారం

మంత్రులు, ఎమ్మెల్యేలకు తెరాస అధిష్ఠానం ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ మహానగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలిక, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూరు పురపాలికల్లో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై సమగ్ర సమాచారం పంపించాలని తెరాస అధినాయకత్వం మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించింది. కొత్త మేయర్‌, ఛైర్‌పర్సన్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించిన అధిష్ఠానం త్వరలోనే పాలకమండళ్ల ఎన్నికల దృష్ట్యా సత్వర సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. వారి సామాజికవర్గాలు, విద్యార్హతలు, వయస్సు, రాజకీయ అనుభవం తదితర వివరాలు కోరింది. దీనికి అనుగుణంగా మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మం కొత్త కార్పొరేటర్ల సమగ్ర సమాచారాన్ని మంగళవారం రాత్రి పార్టీ అధిష్ఠానానికి పంపారు. ఖమ్మం కార్పొరేటర్లతో సమావేశమై మేయర్‌, ఉప మేయర్‌ అభ్యర్థులపై నిర్ణయాన్ని అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం చేసి, దానినీ హైదరాబాద్‌కు పంపించారు. వరంగల్‌లోని కార్పొరేటర్ల సమాచారం ఒకటి, రెండురోజుల్లో చేరనుంది. పురపాలక సంఘాల నుంచి గురువారం వరకు సమాచారం అందే వీలుంది. నగరపాలక, పురపాలక మేయర్‌, ఉపమేయర్‌, ఛైర్‌పర్సన్‌, ఉప ఛైర్‌పర్సన్లను అధిష్ఠానం ఎంపిక చేసి, వారి ఎన్నికల సమావేశం రోజున అధికారికంగా ప్రకటించే వీలుంది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు