close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెరిపిన పడని బెంగాల్‌

కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు
గవర్నర్‌కు ఫోన్లో ఆందోళన వెలిబుచ్చిన మోదీ

కోల్‌కతా, దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పు బర్ధమాన్‌ జిల్లాలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన పంచాయతీ సభ్యుడొకరిని సోమవారం రాత్రి భాజపా కార్యకర్తలుగా భావిస్తున్నవారు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసినవారితో తమకు సంబంధం లేదని భాజపా ఖండించింది. మరికొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలపై, ఇళ్లపై దాడులు కొనసాగాయి. హావ్‌డాలో కనీసం 15 మంది భాజపా కార్యకర్తల ఇళ్లను కొల్లగొట్టడంపై దర్యాప్తు మొదలైంది. వివిధ జిల్లాల్లో ఎన్నికల ఫలితాల అనంతర హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని తనతో ఫోన్లో మాట్లాడి రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల ఆందోళన వెలిబుచ్చారని గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘‘ఈ ఘటనలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఎన్నికల అనంతర హింస బెంగాల్‌లోనే ఎందుకు జరుగుతోంది?’’ అని గవర్నర్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమీక్ష నిర్వహించారు.

దేశ విభజననాటి పరిణామాలు: నడ్డా
బెంగాల్‌ పరిణామాలను చూస్తుంటే దేశ విభజననాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన భాజపా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెబుతానని తెలిపారు. మరోవైపు.. బెంగాల్‌లో హింసాత్మక ఘటనల్ని కాంగ్రెస్‌ ఖండించింది. ఇవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు జితిన్‌ ప్రసాద ట్వీట్‌ చేశారు.

నందిగ్రామ్‌ ఆర్‌వోకు భద్రత
నందిగ్రామ్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి భద్రత కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది.  ‘ఎన్నికల విధుల్లో అధికారులు అత్యంత సమర్థతతో, పారదర్శకంగా పనిచేస్తారు. వారికి దురుద్దేశాలు ఆపాదించడం వాంఛనీయం కాదు. నందిగ్రామ్‌లో టేబుల్‌వారీ సూక్ష్మ పరిశీలకులు ఇచ్చిన నివేదికలపై గానీ, రౌండ్లవారీ ఫలితాలపై గానీ ఎలాంటి సందేహాలూ వ్యక్తం చేయలేదు. అందువల్లనే ఆర్‌వో నిరాటంకంగా ఓట్ల లెక్కింపులో ముందుకు వెళ్లగలిగారు. ప్రతి రౌండు ఓట్ల సంఖ్యపై ఏజెంట్లు సహా అందరూ సంతకాలు చేశారు’ అని ఈసీ వివరించింది.
* బెంగాల్‌లో హింసకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. అధికారుల బృందంతో క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపించి.. రెండువారాల్లోగా నివేదిక సమర్పించాలని కమిషన్‌లోని పరిశోధన విభాగం డీఐజీని ఆదేశించింది.
* బెంగాల్‌లో హింసపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ భాజపా జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు