close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈటలపై అధిష్ఠానానికి లేఖ రాసే యోచన

ఉమ్మడి కరీంనగర్‌ ప్రజాప్రతినిధుల చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న ఈటల రాజేందర్‌పై క్రమశిక్షణ చర్యల కోసం అధిష్ఠానానికి లేఖ రాయాలని కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు యోచిస్తున్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్యేలు మంగళవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల వైఖరిపై వారు చర్చించినట్లు తెలిసింది. ఆయనపై అభియోగాలకు తోడు సీఎంపై, ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానాన్ని కోరాలని పలువురు అభిప్రాయపడ్డట్లు సమాచారం. చివరకు దీనిపై అధిష్ఠానం ఆలోచనకు అనుగుణంగా నడుచుకోవాలని నిర్ణయించారు. గతంలో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ నిజామాబాద్‌ నేతలు అధిష్ఠానానికి లేఖలు రాశారు. అయితే డీఎస్‌, భూపతిరెడ్డి ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందని భావించిన అధిష్ఠానం వారిపై చర్యలు తీసుకోలేదు.

పదవి పోగానే కులం గుర్తొచ్చిందా?: గజ్జల కాంతం

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఆత్మగౌరవ పోరాటం అంటున్న ఈటల రాజేందర్‌కు అసలు దాని అర్థం తెలుసా? అని తెలంగాణ ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జల కాంతం ప్రశ్నించారు. ‘ఇది మీ ఆత్మగౌరవమా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమా? మీ స్వార్థ రాజకీయాల కోసం ఆత్మగౌరవ పోరాటమా!’ అని విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విషయం ప్రస్తావించారా? కనీసం ముదిరాజ్‌ల కోసం మాట్లాడారా? అని ప్రశ్నించారు. కుల సంఘాలు, యువజన సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వందమందిపై కేసులు పెట్టి అణచివేసిన మీకు, ఇప్పుడు కులం గుర్తొస్తుందా అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుడిగా ప్రశ్నిస్తున్నా.. వీటికి జవాబులు చెప్పగలరా? అని అన్నారు. ఈటల సహా ఎస్సీల భూములు, ఆలయ భూములు కబ్జాచేసిన అందరిపైనా విచారణ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దేశంలో కరోనా ఉద్ధృతికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలే కారణమని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించి స్వయంగా వారే అనేక బహిరంగ సభల్లో పాల్గొని కరోనా ఉద్ధృతికి కారణమయ్యారన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు