మొదట కరోనా..తర్వాత శాంతిభద్రతలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మొదట కరోనా..తర్వాత శాంతిభద్రతలు

ప్రాధమ్యాలు వివరించిన మమత
బెంగాల్‌ సీఎంగా ప్రమాణం

కోల్‌కతా: కరోనాను ఎదుర్కోవడం, శాంతిభద్రతల్ని పునరుద్ధరించడం.. ఈ రెండూ తన ప్రాధాన్యాంశాల్లో మొదటి రెండు స్థానాల్లో ఉంటాయని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. సీఎంగా బుధవారం ఆమె ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా, కొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆమె చేత బెంగాలీ భాషలో ప్రమాణం చేయించారు. అనంతరం నేరుగా ఆమె సచివాలయానికి వెళ్లి కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్న రాష్ట్రంలో శాంతిని పునఃస్థాపించడం తన రెండో ప్రాధాన్యమని చెప్పారు. భాజపా నెగ్గిన చోట్ల హింస, ఘర్షణలు తలెత్తుతున్నాయని, హింసకు పాల్పడుతున్నవారినెవరినీ వదిలి పెట్టేది లేదని చెప్పారు.  ఎన్నికలకు ముందు విధుల నుంచి తొలగింపునకు గురైన డీజీపీ వీరేందర్‌, అదనపు డీజీ జావేద్‌ షమీమ్‌లను తిరిగి అదే పదవుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు. బెంగాల్‌ సీఎంగా మమత బాధ్యతలు చేపట్టడం వరసగా ఇది మూడోసారి. కార్యక్రమం అనంతరం మమతను ఉద్దేశించి గవర్నర్‌ కొన్ని ‘సూచనలు’ చేశారు. రాజ్యాంగానికి, చట్టపరమైన నిబంధనలకు లోబడి ఆమె పాలనను అందిస్తారని ఆశిస్తున్నట్లు విలేకరుల వద్ద నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  
అభినందించిన మోదీ
సీఎంగా బాధ్యతలు చేపట్టిన మమతను ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా అభినందించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధానికి మమత లేఖ రాస్తూ- రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌, రెమ్‌డెసివిర్‌ వంటి ఔషధాలు అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 9న మమత తన మంత్రిమండలిని విస్తరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.  
భాజపా నిరసన ప్రదర్శనలు
తమపై తృణమూల్‌ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ భాజపా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్‌ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు