అస్సాం సీఎం రేసులో హిమంత ముందంజ?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అస్సాం సీఎం రేసులో హిమంత ముందంజ?

  నేడు గువాహటిలో భాజపా శాసనసభాపక్ష భేటీ

ఈనాడు-గువాహటి, దిల్లీ: అస్సాం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది స్పష్టం కాబోతోంది. ఆర్థిక మంత్రి హిమంత బిశ్వశర్మకు సీఎంగా అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. శాసనసభకు కొత్తగా ఎన్నికైన భాజపా సభ్యులు ఆదివారం గువాహటిలో సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు. దీంతో ఆరు రోజుల సందిగ్ధతకు తెరపడనుంది. ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌, ఆయనకు పోటీదారుగా ఉన్న మంత్రి హిమంత బిశ్వశర్మలు శనివారం దిల్లీ చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో పలు దఫాలుగా జరిగిన సమావేశాలకు వారు తొలుత విడివిడిగా, తర్వాత కలిసి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం పదవి కోసం ఇద్దరూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. సీఎం పదవిపై భారీ ఆశలు పెంచుకున్న హిమంత రాజీ పడేందుకు ససేమిరా అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎంపికపై మల్లగుల్లాలు
పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఏ కారణంతో ముఖ్యమంత్రిని మార్చాలో తెలియక అగ్రనాయకత్వం సతమతమవుతోంది. ముఖ్యమంత్రి పదవికి తాను రెండో ఎంపికేనన్న కారణంతోనే హిమంత శర్మ కాంగ్రెస్‌ని వీడి 2016 ఎన్నికలకు ముందు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. అదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ తలెత్తడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. భాజపా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో కనీసం 30 మంది శర్మకు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో హిమంత బిశ్వశర్మకు అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. భాజపాకు భారీ మద్దతు అందించిన ఎగువ అస్సాం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సోనోవాల్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం 11 గంటలకు శాసనసభాపక్ష సమావేశంలో నాయకుడిని ప్రకటిస్తారని హిమంత శర్మ వెల్లడించారు. భాజపాలో పరిణామాలను కాంగ్రెస్‌ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. ఏమాత్రం అవకాశం చిక్కినా భాజపాయేతర ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలకడానికి సిద్ధపడుతోంది. శాసనసభాపక్ష నేతల ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు అస్సాంకు కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌లను భాజపా నియమించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు