హిమంతకే అస్సాం పగ్గాలు
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హిమంతకే అస్సాం పగ్గాలు

 సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం

ఈనాడు, గువాహటి: అస్సాంలో భాజపా శాసనసభాపక్ష నేతగా హిమంత బిశ్వశర్మ ఆదివారం ఎన్నికయ్యారు. శాసనసభాపక్ష సమావేశానికి ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రొఫెసర్‌ జగదీష్‌ ముఖిని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. శాసనసభాపక్ష సమావేశంలో హిమంత పేరును సోనోవాల్‌ స్వయంగా ప్రతిపాదించారు. సమావేశం ఏకగ్రీవంగా కొత్త నేతను ఎన్నుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకునిగా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ హాజరయ్యారు. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగానూ శర్మ ఎన్నికైనట్లు ఆయన ప్రకటించారు. గువాహటిలో సోమవారం జరిగే కార్యక్రమంలో రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బిశ్వశర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆదివారం సాయంత్రం గవర్నర్‌ జగ్‌దీష్‌ ముఖితో బిశ్వశర్మ భేటీ అయ్యారు. ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరారు. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు.
ఉప ముఖ్యమంత్రిగా అతుల్‌ బొరా!
వ్యవసాయశాఖ మంత్రి, అసోం గణ పరిషత్‌ అధ్యక్షుడు అతుల్‌బొరాకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం లభిస్తుందన్న ప్రచారం కొద్దికాలంగా సాగుతోంది.

రెండు దశాబ్దాల రాజకీయ దక్షత

హిమంత బిశ్వశర్మ(52) విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ వచ్చారు. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన శర్మ 2001లో జలుక్‌బరి నుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వరుసగా అయిదోసారి అదే నియోజకవర్గం నుంచి లక్షకు పైగా ఆధిక్యంతో ఎన్నికయ్యారు. దివంగత కాంగ్రెస్‌ దిగ్గజం తరుణ్‌ గొగొయ్‌కు సన్నిహితునిగా వ్యవహరించి, ఆయనతో విభేదిస్తూ 2015లో భాజపాలో చేరారు.
సంక్షోభాల పరిష్కర్త
అత్యంత చురుకైన రాజకీయ నాయకుడిగా, ఈశాన్య భారతంలో సంక్షోభాల పరిష్కర్తగా శర్మ అంచెలంచెలుగా ఎదిగారు. మొన్నటి ఎన్నికల్లో భాజపా తిరిగి అధికారంలోకి రావడానికి ఆయన ప్రచారం, ఎత్తుగడలు, వ్యూహాలు కారణమని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏడాదిపాటు ఆరోగ్యశాఖ మంత్రిగా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని పాలనాదక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బోడోలాండ్‌ ప్రాంతంలో భాజపా కాలు పెట్టేలా చేయడం కేంద్ర నాయకత్వాన్ని ఆకట్టుకుంది. ప్రధాని మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఆయనపై మంచి గురి ఉంది. అస్సాం ఒక్కటే కాదు.. ఈశాన్య ప్రాంతంలో తొలిసారి భాజపా గణనీయంగా పుంజుకోవడానికి శర్మ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు