విదేశాలకు టీకాల పంపిణీపై కాంగ్రెస్‌, ఆప్‌ దుష్ప్రచారం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశాలకు టీకాల పంపిణీపై కాంగ్రెస్‌, ఆప్‌ దుష్ప్రచారం

 84% డోసులు నిబంధనల మేరకు పంపినవే..
 భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా

దిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని భాజపా బుధవారం ఆరోపించింది. భారత్‌ నుంచి విదేశాలకు పంపించిన టీకా డోసుల్లో 84% నిబంధనల ప్రకారం ఉత్పత్తి సంస్థలు పంపాల్సినవేనని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విదేశాలకు పంపిన టీకాలపై వివరణ ఇచ్చారు. 1.07 కోట్ల టీకా డోసులను భారత్‌ సహాయపూర్వకంగా విదేశాలకు ఇచ్చిందని, అందులో 78.5 లక్షల టీకాలను 7 పొరుగు దేశాలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. పొరుగు దేశాలు సురక్షితంగా ఉండటం భారత్‌కు మంచిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2 లక్షలకు పైగా డోసులను ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి అందజేసినట్లు వివరించారు. ఇందులో 6,600 మంది భారత సైనికులు ఉన్న విషయాన్ని పాత్రా గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం భారతీయులను విస్మరించి 6.63 కోట్ల కొవిడ్‌ డోసులను విదేశాలకు పంపించిందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆప్‌ నేతలు చేస్తున్న విమర్శలను పాత్రా ఖండించారు. ఇందులో 5.50 కోట్ల డోసులను భారత్‌లో టీకాలు ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థలూ వాటికి సంబంధించిన లైసెన్సింగ్‌, వాణిజ్యపరమైన నిబంధనలకు అనుగుణంగా పంపినవేనని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత ప్రపంచీకరణ శకంలో ఏ దేశమూ ఒంటరిగా ఒక ‘దీవి’లా మనజాలదు. సహకారంతోనే మెలగాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సంస్థలు అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకాల ఫార్ములాలను కేంద్రం ఇతర సంస్థలకు అందజేయాలంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చేసిన సూచనపై కూడా సంబిత్‌ పాత్రా స్పందించారు. ఎస్‌ఐఐకి ఆస్ట్రాజెనెకా సబ్‌-లైసెన్స్‌ ఇచ్చినందున తమ ఫార్ములాను ఇతర సంస్థలకు ఇవ్వలేదని, అందుకు సంబంధించిన మేధో సంపత్తి హక్కులు ఆస్ట్రాజెనెకాకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే భారత్‌ బయోటెక్‌ రూపొందించిన స్వదేశీ టీకాను ఉన్నత స్థాయి ‘బయో-సేఫ్టీ’ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంటుందని.. అతి కొద్ది సంస్థలకు మాత్రమే ఆ సామర్థ్యం ఉందని తెలిపారు. ఈమేరకు కేంద్రం కొన్ని పీఎస్‌యూలు సహా ఆయా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. అన్ని సంస్థలూ టీకాల ఉత్పత్తి పెంచేందుకు అహరహం పనిచేస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని ‘రాజకీయం’ చేయవద్దని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఇతర ఆప్‌ నేతలను కోరారు. దిల్లీ ప్రభుత్వం తాము 1.34 కోట్ల టీకా డోసులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు చెబుతుండటాన్ని కూడా పాత్రా తోసిపుచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు