కేరళ కేబినెట్‌లో అంతా కొత్తవారే

ప్రధానాంశాలు

కేరళ కేబినెట్‌లో అంతా కొత్తవారే

  సీఎం విజయన్‌ మినహా  పాత వారెవరికీ దక్కని చోటు
  ఆరోగ్య శాఖ మాజీ మంత్రి  శైలజకు పార్టీ విప్‌ పదవి
  రేపు నూతన మంత్రివర్గం ప్రమాణం

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్‌డీఎఫ్‌)లోని ప్రధాన భాగస్వామ్య పక్షం సీపీఎం శాసనసభా పక్ష నేతగా ప్రస్తుత సీఎం పినరయి విజయన్‌ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో రెండోసారి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఆయనకు మార్గం సుగమమయ్యింది. మంత్రి మండలి కూర్పుపై సీపీఎం మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మినహా నూతన కేబినెట్‌లో పాతవాళ్లెవరికీ చోటు కల్పించలేదు. కొవిడ్‌ కట్టడి చర్యలతో ప్రాచుర్యంలోకి వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజకూ ఈసారి అవకాశం దక్కలేదు. ఆమె ఇకపై పార్టీ విప్‌గా వ్యవహరించనున్నారు. పార్టీ నిర్ణయం మేరకు 11 మంది కొత్త వారితో మంత్రుల జాబితా ఖరారయ్యింది. వీరిలో ముఖ్యమంత్రి అల్లుడు, డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు మహమ్మద్‌ రియాస్‌ ఒకరు. సీఎం విజయన్‌ సహా సీపీఎం తరఫు నుంచి 12 మంది మంత్రిమండలిలో సభ్యులుగా ఉంటారు. వీరిలో ఇద్దరు మహిళలు. కూటమిలో భాగస్వాములైన సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్‌(ఎం) నుంచి ఒకరికి కేబినెట్‌లో చోటు కల్పించారు. ఈ రెండు పార్టీలు కూడా మంత్రి పదవులకు కొత్త వారినే ఎంపిక చేశాయి.
పార్టీలకతీతంగా విస్మయం
విజయన్‌ తొలి మంత్రిమండలిలో అత్యంత సమర్థురాలిగా పేరు తెచ్చుకున్న శైలజ(64)కు కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై పార్టీల కతీతంగా పలువురు విస్మయం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే అంశం వైరల్‌ అయ్యింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో అనుసరించిన..‘కొత్త తరానికి అవకాశం’ వ్యూహాన్నే మంత్రుల ఎంపికలోనూ సీపీఎం అమలు చేసింది. పార్టీ నిర్ణయాన్ని శైలజ కూడా సమర్థించారు.
గవర్నర్‌కు లేఖ..
సీపీఎం శాసనసభా పక్ష నేతగా మంగళవారం ఎన్నికైన అనంతరం ముఖ్యమంత్రి విజయన్‌ (77) రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ను కలిసి సంబంధిత లేఖను సమర్పించారు. ఈ నెల 20న తిరువనంతపురంలోని సెంట్రల్‌ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో కొత్త మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేయనుంది. కొవిడ్‌ నిబంధనల కారణంగా 50 వేల సామర్థ్యం గల సెంట్రల్‌ స్టేడియంలో 500 మంది అతిథులతోనే కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే, కేవలం 75 మందితోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేలా కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కె.ఎం.షాజహాన్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని