Eatala - Gangula: నీలా సగం బీసీని కాదు.. పూర్తి బీసీని

ప్రధానాంశాలు

Eatala - Gangula: నీలా సగం బీసీని కాదు.. పూర్తి బీసీని

 మాజీ మంత్రి ఈటలపై మంత్రి గంగుల ఆగ్రహం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌:  ‘పదవుల కోసం పెదవులు ముయ్యనన్నవ్‌? ఆత్మగౌరవమని.. ఇంకా కాలయాపన చేస్తున్నవ్‌? పార్టీలోనే ఉంటూ తెరాసపై ఎందుకంత విషాన్ని చిమ్ముతున్నవ్‌.. దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలి..’ అని మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు మంత్రి గంగుల కమలాకర్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన చరిత్ర ఆయనదని విమర్శించారు. కాంగ్రెస్‌, భాజపా కార్యాలయాల మెట్లెక్కే ప్రయత్నం చేసిన ఈటలది ఆత్మగౌరవం కాదని.. ఆత్మవంచన అని ఎద్దేవా చేశారు. ఎసైన్డ్‌ భూములను ఆక్రమించుకోవడం తప్పని తెలిసినా.. బాధ్యతగల హోదాలో ఉండి తప్పుచేయడం వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈటలను బర్తరఫ్‌ చేశారు. అసలు ఆయన ముఖంలోనే తప్పుచేశాననే భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా పార్టీని పట్టుకుని వేలాడడం ఎందుకు.? అని ప్రశ్నించారు. ‘‘హుజూరాబాద్‌లో ఉన్నప్పుడు బీసీ నాయకుడిగా.. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఓసీ నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తి ఈటల. ఆయన లెక్క నేను ఆఫ్‌ బీసీని కాదు. నిఖార్సుగా ఫుల్‌ బీసీని. ఆయన ఎంతమందికి డబ్బులు పంపిణీ చెయ్యలేదు? నన్ను ఓడించాలని చూడలేదా? కరీంనగర్‌ను బొందల గడ్డగా మారుస్తున్నరని విమర్శించే ఆయన ఏడేళ్లుగా మంత్రిగా ఉన్నన్నాళ్లు ఎందుకు క్వారీల గురించి పట్టించుకోలేదు? నిజంగానే ట్యాక్స్‌లు ఎగ్గొడితే ఎందుకు చర్యలు తీసుకోలేదు? కరీంనగర్‌ జిల్లాలోని 350 క్వారీల్లో ఒక్కటి మాత్రమే కమలాకర్‌ది. ఆయన నియోజకవర్గంలో తమిళనాడుకు చెందినవారికి 30కిపైగా క్వారీలున్నయి! వాళ్లు ఎంత ముట్టజెప్పారో చెప్పాలి.
కేసీఆర్‌ ఆగరన్నది నిజం కాదా?
2018 ఎన్నికల్లో తెరాస ఓడిపోవాలని ఈటల మనసులో ఉండె. ఎట్టి పరిస్థితుల్లో 55 సీట్లు రావద్దని ఆయన పలువురితో మాట్లాడిన విషయం వాస్తవమో కాదో.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ‘అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తే కేసీఆర్‌ ఆగరు’ అని ఈటల పలువురు నాయకులతో అన్న మాటలు ద్రోహం కాదా? దేవరయాంజాల్‌ భూముల క్రమబద్ధీకరణ గురించి 2006లో ఆయన అప్పటి దేవాదాయశాఖ మంత్రి ఎమ్మెస్సార్‌ను కలిశారనేందుకు నా పక్కనే ఉన్న మేయర్‌ సునీల్‌రావు సాక్ష్యం. నిజంగా ఆత్మగౌరవం ఉంటే ఆ భూముల్ని సరెండర్‌ చెయ్యాలి. బిడ్డా! అని నన్ను బెదిరిస్తున్నరు.. నేను బీసీ బిడ్డను. భయపెడితే ఎవరూ భయపడరనే విషయం తెలుసుకోవాలి. ఆయన లెక్క మేము ఆస్తుల్ని పెంచుకోలేదు. తిన్నింటి వాసాల్ని లెక్క పెట్టలేదు. కేసీఆర్‌ పార్టీ, కారు బొమ్మ మీద గెలిచిన వ్యక్తి ఈటల రాజేందర్‌. పార్టీపై విషం చిమ్మడాన్ని ఇకపై సహించం’’ అని గంగుల అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని