ప్రజల ఆశయాలకనుగుణంగా పార్టీ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రజల ఆశయాలకనుగుణంగా పార్టీ

 సన్నాహక సమావేశంలో వైఎస్‌ షర్మిల ప్రకటన
 ప్రతి గడపనూ తట్టి అభిప్రాయం సేకరించాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన వచ్చే నెల 8వ తేదీన తమ పార్టీ ఆవిర్భావం ఉంటుందని షర్మిల చెప్పారు. జెండా, ఎజెండా రూపకల్పనలో రాష్ట్ర ప్రజలందరి సలహాలు, సూచనలు స్వీకరించాలని భావిస్తున్నామన్నారు. బుధవారం లోటస్‌పాండ్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలుత కరోనాతో మృతి చెందిన కార్యకర్తలకు శ్రద్ధాంజలి ఘటించారు. ‘రాష్ట్రంలో రాజన్న సంక్షేమ పాలనకు పునరుజ్జీవనానికి సిద్ధపడ్డా. కుటుంబ పాలనతో దగా పడుతున్న ప్రజల పక్షాన పోరుకు తెగించా. ప్రజల ఆలోచనలు, ఆశయాలకనుగుణంగా పార్టీ ఉండాలి. దీనికోసం నెల రోజుల పాటు కార్యకర్తలు ప్రతిగడపకు వెళ్లి ప్రజలు ఏం కోరుకుంటున్నారు... విద్యార్థుల ఆకాంక్షలు, రైతుల అవసరాలు, నిరుద్యోగుల బాధలు తెలుసుకోవాలి. వారి ఆశయాలకు అనుగుణంగా మన సిద్ధాంతాలు రూపొందాలి. మేధావులు, యువత, విద్యావంతులు, న్యాయవాదులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ విశ్లేషకులు సూచనలను వాట్సప్‌ నంబరు: 83741 67039, మెయిల్‌  reach@realyssharmila.com కు పంపించాలి’ అని కోరారు. కరోనాను ఎదుర్కోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈటల రాజేందర్‌ కేసుల భయంతోనే భాజపాలోకి వెళ్తున్నారని, స్వీయరక్షణకు అదే మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు.  
సబ్బండ వర్గాలతో కమిటీలు
ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడం కోసం సబ్బండ వర్గాల నాయకులతో తాత్కాలిక సన్నాహక కమిటీలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 8వ తేదీలోపు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలను పార్టీలో చేర్చాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం అనంతరం రెండు మూడునెలల తరువాతే పాదయాత్ర ప్రారంభించాలని షర్మిలకు నాయకులు సూచించినట్లు తెలిసింది. బుధవారం నిర్వహించిన సమావేశానికి పార్టీ అధికార ప్రతినిధులు కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి, ఇందిరా శోభన్‌తో పాటు ఉమ్మడి పది జిల్లాల నుంచి 175 మంది నాయకులు వచ్చినట్లు తెలిసింది. ఆ జిల్లాల్లోని అన్ని సామాజిక వర్గాల వారికి తాత్కాలిక కమిటీల్లో చోటు కల్పించారు. ఈ కమిటీల జాబితాను కూడా విడుదల చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు