14న కమలం గూటికి ఈటల
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

14న కమలం గూటికి ఈటల

నేడు రాజేందర్‌ ఇంటికి తరుణ్‌ఛుగ్‌, బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కాషాయం గూటికి చేరనున్నారు. ఈ నెల 14న ఆయన దిల్లీలో భాజపా సభ్యత్వం తీసుకుంటారని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఈటలతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తుల ఉమ మరికొందరు నేతలు భాజపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనకు ముందే ఈటల రాజీనామా చేస్తారని సమాచారం. కొవిడ్‌ పరిస్థితులు, స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకని నేపథ్యంలో   ఈమెయిల్‌ ద్వారా రాజీనామా లేఖ పంపే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈటల దిల్లీలో నేరుగా జేపీ నడ్డాను కలిసి కాషాయకండువా కప్పుకొంటారా? లేదా ముందు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకుని, అనంతరం నడ్డాను కలుస్తారా? అన్నదానిపై స్పష్టత రావాల్సిఉంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు లక్ష్మణ్‌, మరికొందరు సీనియర్‌ నేతలు శుక్రవారం మధ్యాహ్నం ఈటలను కలవనున్నారు. జాతీయ సంయుక్త ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్‌ఛార్జి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్‌తో పార్టీ ముఖ్యనేతలు ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. అనంతరం ఈటల నివాసానికి వెళతారు.
తెలంగాణవాదులకు ఏకైక వేదిక భాజపా: బండి సంజయ్‌
తెలంగాణవాదులు, ప్రజాస్వామ్యవాదులకు రాష్ట్రంలో ఏకైక వేదిక భాజపాయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గురువారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. చాలాచోట్ల ధాన్యం కల్లాల్లో ఉందని, వర్షానికి తడిసి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని సంజయ్‌ అన్నారు. మరికొందరు కీలకనేతలు భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం తరుణ్‌ఛుగ్‌ పార్టీ నేతలు బండి సంజయ్‌, డీకే అరుణ, కె.లక్ష్మణ్‌, మురళీధర్‌రావుతో కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని