ప్రసాదకు లభించే ప్రసాదమెంతో?
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రసాదకు లభించే ప్రసాదమెంతో?

పార్టీ మార్పిళ్లు వ్యక్తిగత లబ్ధి కోసమే!
భాజపాలో జితిన్‌ చేరికపై కపిల్‌ సిబల్‌ వ్యాఖ్య

దిల్లీ: దేశంలో రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని, సైద్ధాంతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగతమైన మార్పులను కోరుతూ అధిష్ఠానానికి లేఖ రాసిన 23 మంది నేతల్లో ఒకరైన జితిన్‌ ప్రసాద తాజాగా భాజపా తీర్థం పుచ్చుకోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జితిన్‌ ఇప్పటి వ్యతిరేకిస్తూ వచ్చిన పార్టీలో చేరడం ఏమిటని ప్రశ్నించారు. ‘ఇదంతా రాజకీయ ప్రసాదం(లబ్ధి) కోసమే. సైద్ధాంతిక విలువలను వదిలేసిన తర్వాత ఎంత మేరకు ప్రయోజనం(ప్రసాదం) పొందబోతున్నారు?’ అని సిబల్‌ నిలదీశారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారేందుకు తాను వ్యతిరేకినన్నారు. భాజపాలో చేరాలన్న యోచనే తనకు ఎన్నడూ రాలేదన్నారు. ఆ పార్టీలో చేరడం అంటే తనకు మరణంతో సమానమని గురువారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు.

ప్రజలకు కాంగ్రెస్‌ దూరమయ్యింది: జితిన్‌

వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, పదవుల కోసమో తాను భాజపాలో చేరలేదని జితిన్‌ ప్రసాద అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలతో సంబంధాలను కోల్పోతోందని, ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీని పునరుద్ధరించే యత్నాలే చేయడం లేదని ఆరోపించారు. సిబల్‌ విమర్శలను తిప్పికొడుతూ...మహారాష్ట్రలో శివసేనతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, బెంగాల్‌లో సీపీఎంతో పొత్తును ఏ సిద్ధాంతం ఆధారంగా సమర్థిస్తారని ప్రశ్నించారు.
 

సోనియా గాంధీకి పంజాబ్‌ నివేదిక

పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలను పరిష్కరించడం కోసం నియమించిన ముగ్గురు ఏఐసీసీ సభ్యులతో కూడిన కమిటీ తమ నివేదికను గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సమర్పించినట్లు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య ఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ పంజాబ్‌ వ్యవహారాల బాధ్యుడు హరీశ్‌రావత్‌, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్‌తో కూడిన కమిటీ పలు సూచనలు చేసినట్లు సమాచారం. సిద్ధూకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ తీసుకొనే తుది నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంటుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు